గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 డిశెంబరు 2025 (12:46 IST)

డియర్ మహీంద్రా జీ... ఎన్నో విషయాల్లో రతన్ టాటాను గుర్తుకు తెస్తారు... చిరంజీవి

chiranjeevi - anand
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. మీరు ఎన్నో విషయాల్లో రతన్ టాటాను గుర్తు తెస్తారంటూ కొనియాడారు. హైదరాబాద్ వేదికగా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో చిరంజీవితో పాటు ఆనంద్ మహీంద్రా, సీఎం రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా కలిసి చిరంజీవి ఫోటో దిగారు. ఈ పోటోను చిరంజీవి తన ఎక్స్ వేదికగా షేర్ చేసి కామెంట్స్ చేశారు. 
 
'డియర్‌ ఆనంద్‌ మహీంద్రా మీ వినయం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం నిజంగా ఆదర్శనీయం. మీరు ఎన్నో విషయాల్లో రతన్‌ టాటాను గుర్తుకు తెస్తారు. ఆయన తన విలువలతో గొప్ప వ్యక్తిగా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. మీరు కూడా అలానే అనిపిస్తారు. సేవా కార్యక్రమాలపై మీ నిబద్ధత ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది' అని చిరంజీవి రాసుకొచ్చారు. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
 
తాజాగా 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్' గురించి కూడా చిరంజీవి తాజాగా పోస్ట్‌ పెట్టారు. 'తెలంగాణ రైజింగ్ - 2047 విజన్‌లో భాగంగా అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి కూడా ప్రాముఖ్యతను ఇస్తున్నారు. హైదరాబాద్‌ను ఫిల్మ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే విజన్ చాలా గొప్పది. హైదరాబాద్‌పై ప్రపంచ సినిమా దృష్టిసారిస్తుందని విశ్వసిస్తున్నా' అని అన్నారు.