ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ
రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశంలో ఉన్న ఆస్తమా (ఉబ్బసం) వ్యాధిగ్రస్తులకు బత్తిన కుటుంబ సభ్యులు శుభవార్త చెప్పారు. జూన్ నెల 8వ తేదీన ఉబ్బసం రోగులకు చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రతి యేటా హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే మృగశిర కార్తె చేప ప్రసాద్ పంపిణీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోభాగంగా, దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
హైదరాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ ప్రియాంక, బత్తిన కుటుంబ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ ప్రసాదం కోసం హైదరాబాద్ నగరానికి తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ మేనేజ్‌మెంట్, క్యూలైన్ల నిర్వహణహ ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.
కాగా, కొన్ని దశాబ్దాలుగా బత్తిన గౌడ్ సోదరులు ఈ చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెల్సిందే. ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఇది గొప్ప ఉపశమనాన్ని ఇస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఒక చిన్న బతికున్న చేప పిల్ల నోటిలో మూలికా మిశ్రమాన్ని ఉంచి, దానిని రోగితో మింగిస్తారు. చేపలు తీసుకోనివారి కోసం బెల్లంతో కలిపిన ప్రత్యేక మూలికా మిశ్రమాన్ని సిద్ధం చేసి అందిస్తారు.
