సరిగా చదవడం లేదని అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్
హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్‌లో ఓ దారుణం జరిగింది. ఓ చిన్నారిపై విచక్షణారహితంగా ప్రవర్తించింది. ట్యూషన్‌లోసరిగా చదడం లేదని ఆ చిన్నారికి అట్లగాడతో వాతలు పెట్టింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
హైదరాబాద్, షేక్‌పేటలోని ఓయూ కాలనీకి చెందిన ఏడేళ్ల బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు గురువారం సాయంత్రం స్థానికంగా ఉన్న మానస అనే టీచర్ వద్దకు ట్యూషన్‌కు పంపించారు. అక్కడ సరిగా చదవడం లేదనే కారణంతో టీచర్ మానస ఆ బాలుడి చేతులు, కాళ్లు, ముఖంపై అట్లకాడతో వాతలు పెట్టింది. చిన్నారి శరీరంపై 8 చోట్ల కాలిన గాయాలయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని వైద్య పరీక్షల కోసం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. గాయాల వల్ల బాలుడు నడవలేకపోతున్నాడు. తమ కుమారుడిపై దాష్టీకానికి పాల్పడిన మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని అతడి తల్లిదండ్రులు కోరుతున్నారు.