ప్రయాణికులకు శుభవార్త చెప్పిన హైదరాబాద్ మెట్రో.. ఏంటది?
ప్రయాణికులకు హైదాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం శుభవార్త చెప్పింది. మెట్రో రైళ్లలో రద్దీని తగ్గించే చర్యల్లో భాగంగా, ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లకు బోగీల సంఖ్యను పెంచనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం మూడు కంపార్టుమెంట్లతో ఈ మెట్రో రైళ్లు నడుస్తున్న విషయం తెల్సిందే. ఇకపై ఆరు కోచ్‌లతో ఈ రైళ్లను నడపాలన్న ప్రతిపాదన చేశారు. ఇందుకోసం తొలుత పది రైళ్లను కొనుగోలు చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించింది.
ప్రస్తుతం రద్దీ సమయాల్లో మూడు కోచ్‌ల రైళ్లలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొత్తగా ఆరు కోచ్‌ల రైళ్లు అందుబాటులోకి వస్తే ఒకే ట్రిప్పులో ప్రయాణించే వారి సంఖ్య రెట్టింపుకానుంది. దీంతో ఫ్లాట్‌ఫామ్‌లపై నిరీక్షణ సమయం కూడా గణనీయంగా తగ్గడంతో పాటు ప్రయామం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే గ్లోబల్ టెండర్లను పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు, ఎల్ అండ్ టీ మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించేందుకు ఐడీబీఐ క్యాపిటల్ ఆర్థిక సలహాదారుగా నియమించారు. మెట్రో ఆస్తులు, అప్పులు, నిర్వహణ ఖర్చులపై ఆ సంస్థ వారం రోజుల్లో ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదిక ఇవ్వనుంది. స్వాధీన ప్రక్రియ పూర్తికాకముందే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త కోచ్‌ల కొనుగోలును పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే, మెట్రో రెండో దశ విస్తరణ పనులు కూడా ప్రారంభంకానున్నాయి.