తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిని అవుతా: కల్వకుంట్ల కవిత
తనకు ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించే అవకాశాన్ని తెలంగాణ ప్రజలు ఇస్తారనీ, తద్వారా తెలంగాణకు తొలి మహిళా ముఖ్యమంత్రిని అవుతానంటూ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత చెబుతున్నారు. ఆమె మాట్లాడుతూ... తెరాస పార్టీ పెట్టినప్పుడు చాలామంది ఈ పార్టీ ఉంటదో పోద్దో అని అనుకున్నారు. కానీ నిలదొక్కుకోవడమే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన రాష్ట్ర ఏర్పాటును సాధించుకున్నది. ఐతే దురదృష్టవశాత్తూ ఆ పార్టీలోని కొంతమంది స్వార్థపరులు, అవినీతిపరుల వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతోంది.
అందుకే నేను జాగృతి పార్టీ ద్వారా న్యాయం చేయాలని నిర్ణయించుకున్నా. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పార్టీని పటిష్టం చేస్తాను. ప్రజల అండదండలు నాకు పుష్కలంగా వున్నాయి. వారి సమస్యలకు నేను గొంతునై ప్రశ్నిస్తాను. ఏదో ఒకరోజు నా తెలంగాణ ప్రజలు నన్ను ముఖ్యమంత్రిని చేసి తీరుతారు. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క మహిళ కూడా ముఖ్యమంత్రి కాలేదు. దాన్ని తెలంగాణ ప్రజల ద్వారా సాధిస్తాను. తొలి తెలంగాణ ముఖ్యమంత్రిని అవుతాను అంటూ చెప్పారు.