కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్న... కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత - హరీశ్ రావుపై పోటీ...
తాను కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ కొత్త పార్టీ ఏర్పాటు మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని ప్రకటిస్తామని వెల్లడించారు. తమ పార్టీ పేరులో తెలంగాణ అనే పదం ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను సిద్ధిపేట లేదా బోధన్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తానన ఆమె ప్రకటించారు. కాగా, సిద్ధిపేట నుంచి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెల్సిందే.
హైదరాబాద్ నగరంలోని జాగృతి భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తానని తెలిపారు. తాను సిద్ధిపేట లేదా బోధన్ నుంచి పోటీ చేస్తానని, మొదటి ప్రాధాన్యత మాత్రం సిద్ధిపేటేనని చెప్పారు.
ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల ఆక్యుపెన్షీ రేషియో పెరిగిందని, దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను కర్నాటకలోని దావణగెరెకు తరలించి అన్యాయం చేశారని తెలిపారు. ఉచిత బస్సు కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కవిత డిమాండ్ చేశారు.