అటు ఫోన్ ట్యాపింగ్ - ఇటు లిక్కర్ స్కామ్.. జోరుగా విచారణలు
తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్‌లలో విచారణ జోరుగా సాగుతోంది. శుక్రవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. అలాగే, లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారుల ఎదుట వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు వచ్చారు. ఈ ఇద్దరినీ ఏడేసి గంటల పాటు ఆయా దర్యాప్తు సంస్థల అధికారులు విచారించారు. ముఖ్యంగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌తో పాటు ఈ కేసులో మరో నిందితుడు రాధా కిషన్ రావును కలిపి సిట్ అధికారులు విచారించినట్టు తెలుస్తోంది. ఈ విచారణ ముగిసిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
కాగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట ఠాణాలో నమోదైన కేసును ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా కేటీఆర్‌ను సిట్ విచారించింది. కేసు నమోదై దాదాపు రెండేళ్లు కావస్తున్నా దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు.
మరోవైపు, ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో రాజంపేట వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు విచారించిన అధికారులు.. మిథున్ రెడ్డి వాంగ్మూలం రికార్డు చేశారు. విచారణ అనంతరం ఎంపీ తన నివాసానికి వెళ్లిపోయారు. ఇదే కేసులో గురువారం వైకాపా మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని 7గంటల పాటు ఈడీ విచారించిన విషయం తెలిసిందే.