1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. No Politics, Please Let Me Do My Job : HYDRAA Chief AV Ranganath

జనసేన పార్టీలోకి హైడ్రా కమిషనర్? ఏవీ రంగనాథ్ ఏమన్నారు?

ranganath
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ జనసేన పార్టీలో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై ఆయన స్పందించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ  సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. తన ఉద్యోగాన్ని ప్రశాంతంగా చేసుకోనివ్వాలని కోరుతూ, జనసేన పార్టీలో చేరుతాననే వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఇందులో అనేక విషయాలపై ఆయన స్పందించారు. 'నాకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో గత 20 ఏళ్లుగా మంచి పరిచయం ఉంది. పవన్ కల్యాణ్‌తో కూడా సాన్నిహిత్యం ఉంది. అంతమాత్రానికే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో పోటీ చేస్తానని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌గానూ నన్నే నియమిస్తారని సోషల్ మీడియాలో రాస్తున్నారు. దయచేసి నా ఉద్యోగం నన్ను చేసుకోనివ్వండి. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే నాకు లేదు' అని రంగనాథ్ స్పష్టం చేశారు.
 
ఇకపోతే.. గండిపేట సమీపంలోని జన్వాడలో ఉన్న పవన్ కల్యాణ్ భూమిపై చెలరేగిన వివాదంపై రంగనాథ్ సాంకేతిక అంశాలను వివరించారు. కోడికుంట చెరువు వద్ద ఉన్న ఈ భూమి విషయంలో వాస్తవాలను ఆయన వెల్లడించారు. 'పవన్ కల్యాణ్ 2014లో నలుగురు రైతుల నుంచి సుమారు 10 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2015-16లో చెరువుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్, 2023లో ఫైనల్ నోటిఫికేషన్ జారీ అయింది. చాలా మంది కబ్జాదారులు చెరువులను మట్టితో పూడ్చి నిర్మాణాలు చేపడతారు. కానీ, ఈ భూమి విషయంలో అలా జరగలేదు. భూమి సహజ స్వరూపం ఏమాత్రం మారలేదు. నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగలేదు' అని రంగనాథ్ వివరించారు. 
 
అయితే, ఒక సాంకేతిక ఉల్లంఘన జరిగిందని ఆయన అంగీకరించారు. 'చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం పరిధిలోకి వచ్చేలా ఫెన్సింగ్ వేశారు. ఇది నీటి ప్రవాహాన్ని ఆపకపోయినా, నిబంధనల ప్రకారం తప్పు. అందుకే ఆ ఫెన్సింగ్‌ను తొలగించాలని సూచించాం. ఇలాంటి పట్టా భూములు వేల సంఖ్యలో ఉన్నాయి. సోషల్ మీడియా ఒత్తిళ్లకు తలొగ్గకుండా, అన్ని కేసుల్లో ఒకేలా వ్యవహరిస్తాం' అని స్పష్టం చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆమెకు 81 ఏళ్లు.. ఆయనకు 24 ఏళ్లు.. ఎయిర్ పోర్టులు కలిసివ వేళ... (video)