ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదం, ఫార్చునర్ కారు డివైడర్‌ను ఢీకొని మరో కారుని ఢీకొట్టింది, ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదాలు, తప్పు చేసేది ఒకరు. ఆ తప్పుకు బలయ్యేది మాత్రం ఇద్దరూ. వాహనాలను నడిపేటపుడు అత్యంత జాగ్రత్తగా నడపాల్సి వుంటుంది. అందునా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపైన ప్రయాణం అంటే అన్నివైపులా కళ్లు పెట్టుకుని నడపాల్సి వుంటుంది. ఏమాత్రం ఏమరపాటుగా వున్నా ప్రమాదం జరిగిపోతుంది. శనివారం నాడు ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 సమీపంలో ఓ ఫార్చునర్ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అనంతరం అది పల్టీ కొట్టి అవతలి వైపు ఎదురుగా వస్తున్న టాటా నెక్సాన్ కారును బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. రెండుకార్లు నుజ్జునుజ్జయ్యాయి. తీవ్ర గాయాలపాలైన మరో నలుగురు వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. ఫార్చూన్ కారు మితిమీరిన వేగం ఒకవైపు, భారీవర్షం ఇంకోవైపు కలిసి ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది.
ఓఆర్ఆర్ పైన రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఓఆర్ఆర్ పైన మొదటి రెండు లేన్లలో గరిష్ట వేగ పరిమితి గంటకు 120 కిలోమీటర్లు, అలాగే 3వ, 4వ లేన్లలో గంటకు 80 కిలోమీటర్లుగా నిర్ణయించారు. దీనిని పర్యవేక్షించడానికి ఆటోమేటిక్ స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు.
ఓఆర్ఆర్ పై జరిగే ప్రమాదాలలో ఎక్కువ శాతం అతివేగం, రాత్రి వేళల్లో డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకోవడం, లేన్ క్రమశిక్షణ పాటించకపోవడం, అకస్మాత్తుగా టైర్లు పేలిపోవడం వల్లే జరుగుతున్నాయని గత నివేదికలు చెబుతున్నాయి. ప్రమాదాల నివారణకు గానూ రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచడం, తప్పుగా పార్క్ చేసిన వాహనాలకు భారీ జరిమానాలు విధించడం, లేన్ క్రమశిక్షణ తప్పితే చలాన్లు వేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఎన్నిచేసినా రోడ్డుపై వాహనాలతో కొంతమంది గాలిలో తేలిపోతున్నట్లు దూసుకెళ్తున్నారు. ఇట్లాంటి వారివల్ల ఎంతోమంది ప్రమాదాల్లో బలవుతున్నారు.
