కూకట్‌పల్లిలో ఒక భారీ దోపిడీ.. కంట్లో కారం చల్లి రూ.1కోటి దోచుకెళ్లారు..
హైదరాబాద్ నగరంలో నేరాల సంఖ్య పెరుగుతుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూకట్‌పల్లిలో ఒక భారీ దోపిడీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఇద్దరు వ్యక్తులపై మిరపపొడి చల్లి దాడి చేసి, వారి నుంచి రూ.1 కోటి నగదును దోచుకెళ్లారు.
వివరాల్లోకి వెళితే.. బహదూర్‌పురాకు చెందిన ఖుస్రూ, అజీముద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులను ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డగించారు. వారు బాధితుల కళ్ళలో కారం చల్లి, వారి వద్ద ఉన్న నగదుతో పరారయ్యారు.
నిందితులను పట్టుకోవడానికి, చోరీకి గురైన నగదును స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో దోపిడీకి గురైన నగదుకు హవాలా లావాదేవీలతో సంబంధం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.