కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా... అనుచరులతో జీవన్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు మాజీ మంత్రి, సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి తన అనుచరులతో తెలిపారు. పైగా, ఈ నెల 25వ తేదీన భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరుతున్నట్టు ఆయన సూచన ప్రాయంగా వెల్లడించినట్టు సమాచారం.
గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి జీవన్‌రెడ్డి సేవలందించారు. అయితే, రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో ఆయనకు ఏమాత్రం పొసగడం లేదు. సంజయ్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
పైగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంజయ్ కుమార్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోలేక, కాంగ్రెస్‌లో ప్రాధాన్యం లేనందునే పార్టీని వీడుతున్నట్లు సమాచారం. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
హార్ముజ్ జలసంధి రక్షణకు వస్తాం.. కానీ, సైనిక చర్య తక్షణ నిలిపివేయాలి : చైనా షరతు
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ముడి చమురు రవాణాకు ప్రధాన జలమార్గంగా ఉన్న హర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి, హార్ముజ్ జల సంధిని సురక్షింతంగా ఉంచేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు చైనా స్పందించింది.
హర్మూజ్ రక్షణకు తాము ముందుకురావాలంటే పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఇరువర్గాలకు సూచించారు. ఈ ఘర్షణల వల్ల అంతర్జాతీయ ఇంధన ప్రవాహం, ప్రాంతీయ శాంతి, ప్రపంచ స్థిరత్వం దెబ్బతిన్నాయన్నారు.
ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని లిన్ జియాన్ అమెరికాకు సూచించారు. ప్రస్తుత ఘర్షణలు ఆగితేనే ప్రాంతీయ స్థిరత్వం సాధించగలమని పేర్కొన్నారు. ఈ నెల ఆఖరులో ట్రంప్ బీజింగ్ పర్యటన గురించి అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో ఈ పర్యటన కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ఆదివారం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ హర్మూజ్ ప్రాంతంలో చైనా ప్రయోజనాలే ఎక్కువని వ్యాఖ్యానించారు. ఆ జలసంధిని రక్షించేందుకు ముందుకురావాలని బీజింగ్‌కు పిలుపునిచ్చారు. ఆ దేశం ఇచ్చే సమాధానాన్ని బట్టి బీజింగ్ పర్యటనకు వెళ్లాలా, వాయిదా వేయాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటానన్నారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ పైవిధంగా స్పందించింది.