ఆస్తి కోసం అన్న చేతిలో హత్యకు గురైన న్యాయవాది స్వప్న... గుండె ఆగి చనిపోయిన తల్లి
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో సంచలనం సృష్టించిన న్యాయవాది స్వప్న హత్య కేసులో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా చూసుకున్న కుమార్తె, తోడబుట్టిన అన్న చేతిలోనే దారుణ హత్యకు గురైందన్న వార్తను జీర్ణించుకోలేక తల్లి మల్లమ్మ (70) గురువారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఒకే కుటుంబంలో చోటుచేసుకున్న ఈ రెండు మరణాలతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పదేళ్ల క్రిత తండ్రి శాంతయ్య చనిపోయాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. న్యాయవాది అయిన స్వప్న తన ఇద్దరు తల్లులు వెంకటమ్మ, మల్లమ్మల బాగోగులను చూసుకుంటున్నారు. అయితే, ఆస్తిపై కన్నేసిన స్వప్న సోదరుడు రాజు మరో ముగ్గురితో కలిసి స్వప్నను కిరాతకంగా హత్య చేయించాడు.
అడంగా ఉన్న కుమార్తె హత్యకు గురికావడం, కన్నకొడుకే హంతకుడిగా మారడంతో మల్లమ్మ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. మరో తల్లి వెంకటమ్మ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
