మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క .. ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన ఓ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ సహా నలుగురిపై సస్పెండ్ వేటు వేసింది. మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క అనే శీర్షికపై ఓ వార్తా కథనం వచ్చింది. ఇది ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంది.
జడ్చర్లలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ఆయన విచారణ చేపట్టారు. అనంతరం సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్‌ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్, ఎంఎస్‌వోపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.