ఔటర్ రింగ్ రోడ్డు దక్షిణ ప్రాంతానికి అనుమతిలివ్వండి : సీఎం రేవంత్ రెడ్డి
ఔటర్ రింగ్ రోడ్డు దక్షిణ ప్రాంతానికి అనుమతిలివ్వాలంటూ కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై గడ్కరీతో చర్చించారు.
ఔటర్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తరప్రాంత పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ ప్రాంతానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అనంతరం విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిశారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. వరంగల్ విమానాశ్రయ భూ సేకరణకు సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపించారని, మూడు వారాల్లో పనులు ప్రారంభిస్తామన్నారు.
సీఎంతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, '2 జూన్ 2028 నాటికి వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. వరంగల్ ప్రాంత ప్రజలకు అద్భుతమైన విమానాశ్రయం వస్తుంది. తెలంగాణలో మరిన్ని విమానాశ్రయాలు రావాల్సిన అవసరముంది. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ భూముల వ్యవహారం తేలాక నిర్ణయం తీసుకుంటాం. వీలైనంత త్వరగా భూ సేకరణ పూర్తి చేసి ఆదిలాబాద్ విమానాశ్రయం పూర్తి చేస్తాం' అని కేంద్రమంత్రి తెలిపారు.
