ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి... 2029లోనే జమిలి ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు ప్రజల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి.రామారావుకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ఒక జాతీయ నేత అని ఆయన కొనియాడారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు.
ఆ తర్వాత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణాకు బుల్లెట్ రైలు ఇచ్చారని, హైదరాబాద్ నగరాన్ని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు హబ్‌గా మారుస్తామని సీఎం రేవంత్ తెలిపారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు, ఫ్యూచర్ సిటీ, ఎయిర్ పోర్టు సమీపంలో 500 నుంచి 700 ఎకరాల భూమిని కేటాయించాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని, అమీర్‌పేటలో ఆయన విగ్రహం పెట్టి తీరుతామని చెప్పారు. ఇకపోతే, నూటికి నూరు శాతం మా ప్రభుత్వంలో ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ లేదన్నారు. నాలుగు గోడల మధ్య జరిగే విషయాలతో తమకు పని లేదని, ప్రజాక్షేత్రంలోనే జరిగే విషయాలు, ప్రజల నుంచి వచ్చే సమాచారమే మాకు ముఖ్యమన్నారు.
ఇకపోతే, వచ్చే 2029లో దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయని, అపుడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థులే తప్ప, శత్రువు లేరన్నారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖ రాసి 6 నెలలు అయిందని గుర్తు చేసారు. దీనిపై కేంద్రం ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.