గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 జనవరి 2026 (16:14 IST)

మా మంత్రులను బద్నాం చేస్తే సహించను... వార్తలు రాసేముందు వివరణ అడగండి : సీఎం రేవంత్

Revanth Reddy
మా మంత్రులను బద్నాం చేస్తే సహించే ప్రసక్తే లేదని, మా మంత్రులపై వార్తలు రాసే ముందు తనను వివరణ అడగాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ, తన తొలి రాజకీయ ప్రయాణాన్ని ఖమ్మం జిల్లాలోనే ప్రారంభించానని చెప్పారు. 
 
ఆనాడు ఎన్టీఆర్‌ రూ.2 కిలో బియ్యం ప్రవేశపెడితే.. ఇపుడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ సారథ్యంలో ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలను సాధించడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అని తెలిపారు. 
 
'గత ప్రభుత్వంలో రేషన్‌కార్డు రావాలంటే ఉన్నవాళ్లలో ఎవరో ఒకరు చనిపోవాలనే పరిస్థితి ఉండేది. ఈ ప్రజాపాలనలో లక్షలాది రేషన్‌కార్డులు పేదలకు అందించాం. గతంలో ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసి రైతుల సమస్యలు తీర్చిన ఘనత వైఎస్సార్‌దే. 
 
ఇప్పుడు పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. బీఆర్‌ఎస్‌ పేదవాడిపై కుట్ర చేసి.. ఇళ్లు ఇవ్వకుండా చేసింది. అందుకే పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంది. అధికారంలోకి వచ్చాక 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.
 
సింగరేణి విషయంలో ప్రభుత్వంపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కుంభకోణం జరిగిందని, సింగరేణి బొగ్గు మాయమైందని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణి టెండర్లను అనుభవం ఉన్నవారికే ఇస్తాం. ఈ విషయంలో అణా పైసా కూడా అవినీతికి ఆస్కారం లేదు.
 
రెండేళ్ల పాలనలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వలేదు. భద్రాచలానికి రూ.100 కోట్లు ఇస్తానని కేసీఆర్‌ ఏమీ ఇవ్వలేదు. మా ప్రభుత్వంలో భద్రాచలంలో భూసేకరణ జరుగుతోంది. అయోధ్యని తలపించేలా భద్రాచలాన్ని అద్భుతంగా నిర్మిస్తాం. తప్పుడు ప్రచారం ద్వారా బీఆర్‌ఎస్‌ నేతలు బలపడేలా చేయొద్దు. 
 
మీడియా వారి మధ్య గొడవలుంటే తలుపులు మూసుకొని కొట్టుకోండి. మా మంత్రులను బద్నాం చేయొద్దు. మంత్రులపై వార్తలు రాసే ముందు నా వివరణ అడగండి. మీడియాకు వివరణ ఇచ్చేందుకు నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉంటా. మా మంత్రులపై వార్తలు వస్తే నా గౌరవానికి భంగం కలుగుతుంది. మంత్రులమంతా సమన్వయంతో పనిచేస్తున్నాం. వచ్చే పదేళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.