స్కానింగ్ సెంటర్ రెస్ట్‌రూమ్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. ఆపై చెత్తబుట్టలో పడేసి పరార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ మైనర్ బాలిక ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన షాకిచ్చే నిజాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తన అమ్మమ్మగారింట్లో వుంటూ.. తన వయస్సుండే బాలుడితో కలిసి పరీక్షలు రాసింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా ఆపై శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది.
ఆ బాలిక అనంతలోని కేజీబీవీలో ఇంటర్ చేస్తోంది. గర్భం దాల్చిన విషయం పాఠశాల యాజమాన్యానికి తెలియకుండానే తప్పించుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని మంగళవారం పరీక్ష రాసి కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది.
వైద్యుల సూచనతో స్కానింగ్ సెంటర్‌కు వెళ్లగా అక్కడే బాత్రూంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును తల్లితో కలిసి చెత్తబుట్టలో పడేసింది. అది గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ బాలిక ఉదంతం స్థానికంగా కలకలం రేపింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నాగర్ కర్నూలు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మైనర్ బాలిక, నవజాత శిశువు ఇద్దరినీ నాగర్ కర్నూల్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ ఇద్దరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.