సోమవారం, 16 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

మున్సిపాలిటీ వార్డు మెంబరుగా గెలిచిన మహిళా గొర్రెల కాపరి

bjp flags
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అనేక మంది నిరక్ష్యరాస్యులైన మహిళలు పోటీ చేసి గెలుపొందారు. అలాంటి వారిలో బొడ్డేమొల్ల నాగమ్మ ఒకరు. ప్రకృతిని నమ్ముకుని గొర్రెల కాపరిగా జీవనంసాగిస్తున్నారు. పూర్తి నిరక్ష్యరాస్యురాలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం బొత్తిగా తెలియదు. అలాంటి మహిళకు అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. 
 
ఈ మున్సిపల్ ఎన్నికల్లో నారాయపేట మున్సిపాలిటీ 19వ వార్డు నుంచి బీజేపీ పట్టణ నాయకత్వం ఆమెను కోరింది. అయితే, తనకు రాజకీయాలు అంటే ఏమిటో తెలియని చెప్పిన ఆమె.. తన భర్త ప్రోద్భలంతో పోటీ చేశారు. ఆ తర్వాత భర్తతో పాటు వార్డులో ఉన్న బీజేపీ యువత, నాయకుల సహకారంతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసింది. 
 
తనను గెలిపిస్తే గృహిణులకు, రైతులకు బీజేపీ తరపున అండగా ఉంటానని, అందరి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ప్రచారం చేసింది. చివరకు శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఆమె విజయం సాధించింది. తన సమీప ప్రత్యర్థి సతీశ్‌ గౌడ్‌పై 154 ఓట్ల మెజార్టీతో 19వ వార్డు కౌన్సిలర్‌గ విజయకేతనం ఎగురవేశారు. ఎన్నికల్లో గెలుపొందిన ఆమెకు అన్ని పార్టీల నేతలు అభినందలు తెలుపుతున్నారు.