శనివారం, 14 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026 (14:53 IST)

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : ఒక్క ఓటు మెజార్టీ విజేతలు వీరే...

telangana state
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా, పరకాల పురపాలక సంస్థకు జరిగిన ఎన్నిక్లలో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీలోని 17వ వార్డు ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్రకు 369 ఓట్లు పోలవ్వగా, భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేసిన శనిగరపు రజినీకి 368 ఓట్లు వచ్చాయి. దీంతో రజినీ రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోగా రెండోసారి కౌంటింగ్‌ చేసినప్పటికీ ఫలితంలో మాత్రం తేడా రాలేదు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర గెలుపొందినట్టుగా అధికారులు ప్రకటించారు. 
 
అలాగే, కల్వకుర్తి మున్సిపాలిటీలోని పదో వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య విజయం దోబూచులాడింది. తొలుత కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్‌కు రెండు ఓట్ల మెజారిటీ రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి తాహిర్ రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేశారు. దీంతో అధికారులు మరోమారు ఓట్లను లెక్కించగా ఎజాస్‌కు 259 ఓట్లు, తాహిర్‌కు 258 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్ గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు.