ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మార్చి 2026 (16:19 IST)

కన్నపేగు బంధాన్ని కాసులకు అమ్మేశారు.. ఎక్కడ?

baby birth
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. డబ్బులకు కక్కుర్తిపడిన ఓ దంపతులు కన్నపేగు బంధాన్ని కాసులకు అమ్మేశారు. పుట్టిన వారం రోజులకే తమ మగబిడ్డను విక్రయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాకు చెందిన ఓ గిరిజన దంపతులకు గత ఫిబ్రవరి నెల 10వ తేదీన మగబిడ్డ జన్మించాడు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ పసికందును వారం రోజులకే కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులకు అమ్మేశారు. ఈ దారుణం అంగన్వాడీ టీచర్ చొరవతో బయటపడింది. 
 
బిడ్డ పుట్టిన తర్వాత తల్లి అంగన్వాడీ కేంద్రానికి గుడ్లు, ఇతర పోషకాహారం కోసం రాకపోవడంతో టీచర్‌కు అనుమానం వచ్చింది. దీంతో ఆ దంపతుల ఇంటికి వెళ్లి చూడగా, ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించారు. 
 
దీంతో వెంటనే ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు దర్యాప్తు చేపట్టగా, ఆ గిరిజన దంపతులు మరో గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. వారిని పట్టుకుని బిడ్డ గురించి ఆరా తీయగా, అసలు నిజం ఒప్పుకున్నారు. బిడ్డను రూ.1.7 లక్షలకు కామారెడ్డి దంపతులకు అమ్మేసినట్లు తెలిపారు. దీంతో అధికారులు వారిని హవేలీఘనాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.