శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By chitra
Last Updated : గురువారం, 17 మార్చి 2016 (13:21 IST)

హైటెక్ విధానంలో ఇంటర్ విద్యార్థి కాపీయింగ్.. అరెస్టు.. ఎలా?

సరికొత్త టెక్నాలజీని అందింపుచ్చుకోవడంలోనూ, వినియోగించుకోవడంలోనూ యువత ఎల్లవేళలా ముందు వరుసలోనే ఉంటుంది. అందుకు నిదర్శనం ఈ ఇంటర్ విద్యార్థి గురించి చెప్పుకోవచ్చు. ఎస్సార్ నగర్‌లోని ఓ కాలేజీలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో విద్యార్థి హైటెక్ కాపీయింగ్ చేస్తూ బుధవారం పట్టుపడ్డాడు. అతనికి సహకరించిన అతని అనుచరుడు సమీయుల్లా అనే వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
 
అసలు విషయానికొస్తే ఎన్నారై కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, ఆన్‌లైన్ నుండి బ్లూటూత్ పరికరం, మైక్రోఫోన్ ఉన్న బనియన్‌ను కొని, దాన్ని వంటికి ధరించి పరీక్షకు హాజరయ్యాడు. బుధవారం ఎకనామిక్స్ పరీక్ష రాసేందుకు వచ్చాడు. ఇతని మీద అనుమానం కలగడంతో అధికారులు తనిఖీలు చేపట్టగా ఈ హైటెక్ మోసం గుట్టు బయట పడింది. 
 
మొదటి సంవత్సరంలో కొన్నిసబ్జెక్టుల్లో తప్పిన ఇతడు ఈసారి ఎలాగైనా పాస్ కావాలని నిర్ణయించుకుని ఈ కొత్త పథకాన్ని అనుసరించాడు. ఇందుకోసం అతడు ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడే వారిని ఆశ్రయించి షాప్‌క్లూస్ సైట్ నుంచి బ్లూటూత్ పరికరం, రూ.13,200 ధర చేసే మైక్రోఫోన్ ఉన్న బనియన్‌ను కొనుక్కున్నాడు. దానిని తొడుక్కుని సివిక్స్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను దిగ్విజయంగా రాసేశాడు. అతడికి బయటి నుంచి సమాధానాలు ఇస్తూ సమీయుల్లా అనే వ్యక్తి సాయం చేసేవాడు. 
 
అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బుధవారం ఏజాజ్‌తోపాటు సమీయుల్లాను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాన్ని అంగీకరించారని  డీసీపీ వెంకటేశ్వర్‌రావు మీడియాకు చెప్పారు.