బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 17 జనవరి 2016 (08:16 IST)

తెదేపాలో చేరిన సినీనటి జయసుధ... మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా?

jayasudha
సినీనటి జయసుధ తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె పచ్చకండువా కప్పుకున్నారు. ఇదే అంశంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నానని, ఇకపై తెదేపాతో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. 
 
కాగా, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. జయసుధ గత కొంతకాలంగా రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంలేదు. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్‌ పార్టీని వీడి తెదేపాలో చేరారు. 
 
అయితే, ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమ శక్తియుక్తులను ధారపోసి.. గెలుపుకోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జయసుధ టీడీపీలో చేరడం గమనార్హం. పైగా గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే గ్రేటర్ మేయర్ కుర్చీని ఆమెకు అప్పగించే అవకాశాలు లేకపోలేదనే గుసగుసలు వినొస్తున్నాయి. 
 
మరోవైపు.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ల గడువు ఆదివారంతో ముగియనుంది. శనివారం ఒక్కరోజే 1003 నామపత్రాలు దాఖలయ్యాయి. తెరాస 277, భాజపా 93, తెదేపా 187, కాంగ్రెస్‌ 200, స్వతంత్ర అభ్యర్థులు 249 నామపత్రాలు సమర్పించారు.