గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 10 సెప్టెంబరు 2014 (18:57 IST)

ఎ.పి. ఫిలిం ఛాంబర్‌ తమ వైఖరి మార్చుకోవాలి

'ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఛాంబర్‌'ను 'తెలుగు ఫిలిం ఛాంబర్‌'గా మార్చాలన్న ఆలోచనను, ఫిలిం ఛాంబర్‌కి సంబంధించి జనరల్‌ బాడీ మీటింగ్‌లను విజయవాడ, వైజాగ్‌లలో పెట్టుకోవాలన్న ఎ.పి.ఫిలిం ఛాంబర్‌ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తెలంగాణా సినిమా ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ 40 మంది నిర్మాతల సంతకాలతో కూడిన ఓ మెమొరాండంను ఎ.పి. ఫిలిం ఛాంబర్‌లో సమర్పించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణా సినిమా ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ సానా యాదిరెడ్డితోపాటు కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు. 
 
సానా యాదిరెడ్డి మాట్లాడుతూ - ''తెలంగాణా ఉనికి, అస్థిత్వం కోసం కెసిఆర్‌గారు ఉద్యమం చేసి తెలంగాణా సాధించారు. అదే పంథాలో తెలంగాణా సినిమా పరిశ్రమ స్థిరపడాలని మా అస్థిత్వం కొరకు, మా నిర్మాతలందరికీ మంచి సినిమాలు చేసే ఫెసిలిటీస్‌ కొరకు ఎ.పి. ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌తో మేం పోరాటం చేశాం. వాళ్ళు రెండుసార్లు జనరల్‌ బాడీ మీటింగ్‌ పెట్టారు. మేం ఎప్పుడైతే ఈ పోరాటం చేస్తున్నామో దాన్ని అనువుగా తీసుకొని కావాలని మోసపూరితంగా ఇప్పుడు వున్న ఎ.పి. ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ని తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌గా మారుస్తామన్నారు. దాన్ని మేం వ్యతిరేకించాం. తెలంగాణా రాష్ట్రం వచ్చింది భాషా పరంగా కాదు. భౌగోళికంగా వచ్చింది. 
 
1956లో భాషా సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పడినపుడు తెలంగాణా రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలు వుండేవి, ఆంధ్రాలో తక్కువ వుండేవి. అప్పుడు తెలంగాణా ప్రదేశ్‌ అంటే కాదన్నారు, తెలుగు ప్రదేశ్‌ అంటే కూడా కాలేదు. ఇండియన్‌ గవర్నమెంట్‌ కన్నడుల కోసం కర్ణాటక, తమిళుల కోసం తమిళనాడు ఇచ్చారు. అడ్మినిస్ట్రేషన్‌ ఫెసిలిటీ కోసం అలా చేస్తే దాన్ని వీళ్ళు వ్యతిరేకించి ఒక్క ప్రాంతానికే పరిమితం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌ అని పెట్టారు. 
 
మరి అప్పుడు లేని పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చింది? తెలుగు అని ఎందుకు పెట్టాల్సి వస్తోంది. తెలంగాణాలో వున్నవాళ్ళం తెలుగువాళ్ళం కాదా? ఇది మోసపూరితమైన ఉద్దేశం కాదా? ఇంకా ఎన్నాళ్ళు ఇలా. ఇప్పటివరకు తెలంగాణాపైన వివక్ష చూపించారు. దయచేసి ఇప్పటికైనా అది మానుకోవాలి. కావాలని తెలుగు అనేది ఎక్కడా పెట్టవద్దు అని నిన్న కేసీఆర్‌గారు కూడా అన్నారు. ఎ.పి., తెలంగాణా వేర్వేరుగా వున్నప్పుడు తెలుగు అని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? దయచేసి ఈ ధోరణి మానుకోండి. 
 
మరో విషయం ఏమిటంటే జనరల్‌ బాడీ మీటింగులు ఆంధ్ర ప్రాంతంలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. రూల్‌ ప్రకారం రిజిస్ట్రేషన్‌ ఎక్కడైతే చేసుకున్నారో అక్కడే జనరల్‌ బాడీ మీటింగ్‌ పెట్టుకోవాల్సి వుంటుంది. మొన్న విజయవాడలో మీటింగ్‌ పెట్టుకున్నారు. మా పోరాటానికి స్పందించిన బి.నర్సింగరావుగారు సికళ్యాణ్‌గారితో భేటీ అయి ఒక నిర్ణయానికి వచ్చారు. మీరు కూడా తెలంగాణా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పెట్టుకోండి అని చెప్పారు. దానికి సంబంధించి ఎలా వుండాలి అనేదానిపై కొన్ని మంచి సూచనలు కూడా చేశారు. 
 
మళ్ళీ ఇప్పుడు ఏమైందో తెలీదు జనరల్‌ బాడీ మీటింగులు విజయవాడలోనో, వైజాగ్‌లోనో పెట్టుకుంటారట. రూల్‌ ప్రకారం అవి చెల్లవు. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తప్పవుతుంది. దయచేసి ఇకనుంచి మీటింగులు ఇక్కడే పెట్టండి. మేం కోఆపరేట్‌ చేస్తాం. మేం పోరాడింది మా అస్థిత్వం కొరకు, తెలంగాణా నిర్మాతల బాగోగుల కోసమే తప్ప మరో విధంగా కాదు. మీరు కలిసి వుండాల్సిన పరిస్థితి వుంది. ఈ పోరాటం అనేది మేకర్స్‌ మధ్యనే తప్ప ఆడియన్స్‌ మధ్య కాదు. తెలంగాణా, ఆంధ్ర ఆడియన్స్‌ చాలా మంచి వారు. 
 
ఏ భాష సినిమా అయినా ఆదరిస్తారు. కాబట్టి విభేదాలకు వెళ్ళకండి. మరికొన్ని రోజులు ఇలాగే వుంటే మా పోరాటం సమాజంలో వున్న అన్ని సంఘాలకు వెళ్ళిపోతే నష్టపోయేది మీరే. తెలంగాణా జిల్లాల నుంచి 45 నుంచి 50 శాతం రెవిన్యూ వస్తుందన్న సంగతి మీకు తెలుసు. అది మరవకండి. దీనికి సంబంధించి ఎ.పి. ఫిలిం ఛాంబర్‌లో మెమొరాండం ఇచ్చాం. ఛాంబర్‌ స్పందించి తగిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది'' అన్నారు.