శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: శనివారం, 14 జూన్ 2014 (18:16 IST)

జరిగేది తెలిస్తే అది 'మాయ'

జరగేది, జరగబోయేది ముందుగా తెలిస్తేఅది 'మాయ' చిత్రమవుతుంది దర్శకుడు నీలకంఠ అన్నారు. హర్షవర్ధన్‌ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్‌ నటీనటులుగా జాతీయ అవార్డ్‌ గ్రహీత నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'మాయ'. షిర్డిసాయి కంబైన్స్‌ పతాకంపై డా|| ఎమ్‌.వి.కె.రెడ్డి - మధుర శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో విడుదల చేశారు. 
 
మల్టీడైమన్షన్‌ వాసు, ఇన్ఫోసిస్‌ నరసింహరావు, పాలెం శ్రీకాంత్‌రెడ్డి, కళామందిర్‌ కళ్యాణ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇన్ఫోసిస్‌ నరసింహరావు, పాలెం శ్రీకాంత్‌రెడ్డి ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపి సినిమా విజయవంతం కావాలని అభిలాషించారు. 
 
దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ... ఎక్స్‌ట్రా సెన్సరీ పెర్‌సెప్షన్‌ కాన్సెప్ట్‌ మీద ఎంతగానో రీసెర్చ్‌ చేసి ఈ కథ రాశాను. ఈ కథాంశంతో అంతర్జాతీయ స్థాయిలో చాలా సినిమాలు వచ్చుండొచ్చు. కానీ తెలుగులో వస్తున్న తొలి చిత్రం ఇదేనని నేననుకుంటున్నాను. మనుషులలో ఉండే అతీంద్రీయ దృష్టి నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది.   వైవిధ్యంతో కూడిన స్క్రీన్‌ప్లేతో సాగే ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ఇది. నా టీమందరి సహకారంతో నేనీ సినిమాను అనుకున్న సమయానికి, అనుకున్నట్లుగా తీయగలిగాను. ఈ సినిమా కథ, కథనం ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి లోను చేస్తుంది అని అన్నారు. 
 
మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ... తెలుగు సినిమా చరిత్రలో మాయ సినిమా ది బెస్ట్‌ థ్రిల్లర్‌ అవుతుందని నా నమ్మకం. నీలకంఠ దర్శకత్వంలో ఇంతటి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వపడుతున్నాను. శేఖర్‌చంద్ర సంగీతం, బాల్‌రెడ్డి ఫోటోగ్రఫీ, నవీన్‌ నూలి ఎడిటింగ్‌ పనితనం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్ళాయి. ఈ నెల 22న పాటల్ని విడుదల చేసి, జూలై 4న సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం అని అన్నారు. సినిమా విడుదల కోసం చాలా యాంగ్జైటీగా ఎదురుచూస్తున్నాను అని హీరో హర్షవర్ధన్‌ రాణె తెలిపారు. 
 
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు: నాగబాబు, ఝాన్సీ, అనితాచౌదరి, వేణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి, ఎడిటింగ్‌:నవీన్‌ నూలి, ఆర్ట్‌: గొట్టపల్లి బాబ్జి,  ప్రొడక్షన్‌ డిజైనర్‌: రమా.డి, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎ.మధుసూదనరెడ్డి, పబ్లిసిటీ డిజైనర్‌: శ్రీ యాడ్స్‌ ఈశ్వర్‌, పిఆర్‌ఓ: జి.శ్రీనివాస్‌ (జి.ఎస్‌ మీడియా), కెమెరా ఎక్విప్‌మెంట్‌: 24 కారెట్‌ సాయిచరణ్‌రెడ్డి, డిఐ: అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యాస్టింగ్‌ ఏజెన్సీ: మురళీకృష్ణ.