శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2015 (16:02 IST)

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా రివ్యూ: విలువలే నా ఆస్తి అంటున్న బన్నీ!

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా ద్వారా స్టైలిష్ స్టార్ కుటుంబ ప్రేక్షకులకు మరీ దగ్గరయ్యాడు. అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా గురువారం రిలీజైన సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన వీరి జులాయి హిట్ కావడంతో పాటు వీరి చివరి చిత్రాలు రేసుగుర్రం, అత్తారింటికి దారేది తర్వాత వచ్చిన సినిమా కావడంతో హైఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సత్యమూర్తి టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అయ్యాడో తెలుసుకోవాలంటే రివ్యూ చదవాల్సిందే.
 
నటీనటులు: అల్లు అర్జున్, సమంత, ఆదాశర్మ, నిత్యామీనన్, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, ఎంఎస్.నారాయణ, బ్రహ్మానందం
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాత: ఎం.రాధాకృష్ణ
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
విడుదల తేదీ : 09 ఏప్రిల్‌ 2015 గురువారం.
 
అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా రిలీజైంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన వీరి జులాయి హిట్ కావడంతో పాటు వీరి చివరి చిత్రాలు రేసుగుర్రం, అత్తారింటికి దారేది తర్వాత వచ్చిన సినిమా కావడంతో హైఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సత్యమూర్తి టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అయ్యాడో చూద్దాం.
 
అల్లు అర్జున్‌ నటించిన 'సన్నాఫ్‌ సత్యమూర్తి'కి దీనికి ట్యాగ్‌లైన్‌ కూడా వుంది. 'విలువలే నా ఆస్తి'. అంటే కథేమిటో కూడా ముందే చెప్పేశాడు దర్శకుడు. దాన్ని తనదైన బాణీలో ఎలా తీశాడనేది చూడాలి. 'అత్తారింటికి దారేది'తో బ్లాక్‌‌బస్టర్‌ హిట్‌ అందుకున్న త్రివిక్రమ్‌ మళ్ళీ అలాంటి కుటుంబ విలువలు ఎలా చూపిస్తాడనేది ప్రేక్షకుల్లో వున్నట్లే ఫ్యాన్స్‌లో కూడా వుంది. మరి ఆ విలువలు వున్నాయా? లేదా? చూద్దాం.
 
కథ :
తన కథను చెప్పుకుంటూపోతాడు ఆనంద్‌(అల్లు అర్జున్‌). ఫ్లాష్‌బ్యాక్‌లోనే సినిమా అంతా. సత్యమూర్తి(ప్రకాష్‌ రాజ్‌) ఇండియాలో ఓ పెద్ద వ్యాపారవేత్త. 300 కోట్లకి ఆస్తిపరుడు. వాటికంటే విలువలనే ఆస్తిగా భావిస్తాడు. పిల్లల్ని అలా పెంచుతాడు. కష్టమేమిటో తెలియకుండా పెరిగిన ఆనంద్‌కు తన నాన్న మరణం బాధ్యత తెలియజేసేలా చేస్తుంది. నాన్న స్నేహితుడు ఐపీ పెట్టమని సలహా ఇచ్చినా ఆయన ఆశయం కోసం ఆస్తిని వదులుకుని పైకి రావాలనుకుంటాడు. దాంతో ఆనంద్‌కు జరిగిన నిశ్చితార్థం ఆగిపోతుంది. ఉద్యోగ వేటలో నిరాశ మిగులుతుంది. క్లాస్‌మేట్‌ ఇచ్చిన చిన్నపాటి మేరేజ్‌ ఈవెంట్‌ కోసం ఊరు వెళతాడు. అక్కడ తనతో నిశ్చితార్థమైన పల్లవి(అదా శర్మ)కి పెళ్లి చేయాల్సిన చిత్రమైన పరిస్థితి. 
 
అనుకోకుండా అక్కడే  సుబ్బలక్ష్మీ అలియాస్‌ సమీర(సమంత)ని చూసి ప్రేమలో పడతాడు. సమీర ఫాదర్‌ అయిన సాంబశివరావు (రాజేంద్ర ప్రసాద్‌)కి ముందు నుంచి   ఆనంద్‌ అంటే పడదు. అందుకే తన ప్రేమ, పెళ్ళిగా మారాలంటే వాళ్ళ నాన్న చేసిన మోసాన్ని తనే సరిదిద్దాలని ఓ సమస్యని ముందు పెడతాడు. 8వేల గజాల స్థలాన్ని ఆక్యుపై చేసిన తమిళనాడులోని దేవరాజ్‌ నాయుడు (ఉపేంద్ర) నుంచి కాగితాలు తీసుకురావడమే. అయితే అక్కడ జరిగిన పరిస్థితుల వల్ల ఆయన సోదరితో ఆనంద్‌కు నిశ్చితార్థం జరుగుతుంది. ఆ తర్వాత ఏమయింది? అనేది కథ. 
 
పెర్‌ఫార్మెన్స్‌
హీరోగా కొత్త లుక్‌తో అల్లు అర్జున్‌ కన్పిస్తాడు. ఎప్పటిలానే డాన్సులు, ఫైట్స్‌, డైలాగ్‌ డెలివరీ ఇలా అన్నీ బాగా చేసాడు.. ఈ సినిమాలో ఎక్కువ ఎమోషనల్‌, సెంటిమెంట్‌ టచ్‌ ఉన్న పాత్ర ఇందులో చేసాడు. బన్ని ప్రతి ఎమోషన్‌‌ని చాలా సెటిల్‌‌గా చేసి, చూసే ప్రతి ఆడియన్‌ తనే ఆనంద్‌ అని ఫీలయ్యేలా చేసాడు. హీరోయిన్లలో అదాశర్మ కంటే సమంత బాగా ఆకట్టుకుంటుంది. నిత్యా మీనన్‌ చేసింది చాలా చిన్న పాత్రే కానీ సినిమాకి మాత్రం చాలా ముఖ్యమైన పాత్ర, ఆ పాత్రని ఆడియన్స్‌ బాగా ఎంటర్టైన్‌ చేస్తుంది. కొన్ని సీన్స్‌‌లో అల్లు అర్జున్‌‌కి ఈక్వల్‌‌గా తన ఎనర్జీ లెవల్స్‌ చూపించింది.  
కన్నడ నటుడు ఉపేంద్ర రాయలసీమ యాసలో మాట్లాడే పాత్ర. రాజేంద్ర ప్రసాద్‌ తన స్టైల్‌ సెటైర్స్‌‌తో ఆకట్టుకున్నాడు. సంపత్‌ రాజ్‌ చేసింది చాలా చిన్న పాత్ర కానీ సినిమాని మలుపు తిప్పే పాత్రలో బెస్ట్‌ నటనని కనబరిచి వెళ్ళిపోయాడు. ఇక అలీ అక్కడక్కడా నవ్వించగా, బ్రహ్మానందం ఎపిసోడ్‌ మాత్రం ఆడియన్స్‌‌ని బాగా నవ్విస్తుంది. వెన్నెల కిషోర్‌, స్నేహ, ప్రకాష్‌ రాజ్‌, పవిత్ర లోకేష్‌, సింధు తులానీలు తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇక సినిమా పరంగా చూసుకుంటే.. సెకండాఫ్‌‌లో కామెడీని బాగా పండించడమే కాకుండా ఎమోషనల్‌ సీన్స్‌‌ని కూడా బాగా చెప్పాడు. పాటల్లో విజువల్స్‌ చాలా గ్రాండ్‌‌గా ఉన్నాయి.
 
టెక్నికల్‌గా....
సినిమాటోగ్రాఫర్‌ ప్రసాద్‌ మూరెళ్ళ బాగా ఆకట్టకునేలా చేశాడు. ప్రతి లొకేషన్‌‌ని తను చూపిన విధానం, నటీనటుల హావభావాలను పర్ఫెక్ట్‌‌గా కాప్చ్యూర్‌ చెయ్యడం, అలాగే ప్రతి ఫ్రేంని ఎంతో కలర్ఫుల్‌‌గా చూపడం తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. ముఖ్యంగా ముగ్గురు హీరోయిన్స్‌ ఉన్నా ఏ ఒక్కరినీ తక్కువ కాకుండా, ఏ ఇద్దరినీ ఒకేలా ఉండకుండా చాలా బాగా చూపించాడు. తరువాత దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన సాంగ్స్‌ జస్ట్‌ హిట్‌ అయితే, ఆన్‌ స్క్రీన్‌ విజువల్స్‌ పరంగా సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇక దేవీశ్రీ ఇచ్చిన బ్యాక్‌‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా సినిమాకి బాగా సెట్‌ అయ్యింది. క్లైమాక్స్‌ సీన్స్‌‌లో రీ-రికార్డింగ్‌ చాలా బాగుంది. ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్‌ ఇంకాస్త బెటర్‌‌గా ఉండాల్సింది. చాలా చోట్ల డ్రాగ్‌ అనిపించిన సీన్స్‌‌ని కట్‌ చేసి ఉంటే బాగుండేది. రవీందర్‌ ఆర్ట్‌ వర్క్‌ బాగుంది. పీటర్‌ హెయిన్స్‌ కంపోజ్‌ చేసిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అందరినీ ఆకట్టుకుంటాయి.
 
దర్శకుడిగా రచన తనే చేసి తనదైన డైలాగ్స్‌ రాశాడు. బాగున్నపడు లెక్కలు అడిగి, లేనప్పుడు విలువలు గురించి మాట్లాడాడటం.. వంటి సన్నివేశపరంగా డైలాగ్స్‌ ఆలోచింపజేస్తాయి. దర్శకుడిగా  కుటుంబ విలువలున్న సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ బలమైన పాయింట్‌‌ని ఎంచుకున్నాడు, కానీ కథని అంత స్ట్రాంగ్‌‌గా రాసుకోలేదు. నడక స్లోగా సాగుతున్నట్లుంటుంది. ప్రాసల్తో ప్రాకులాడే పంచ్‌ డైలాగ్స్‌‌తో ఎంటర్టైన్‌ చెయ్యడంలో మాత్రం ఫెయిల్‌ అయ్యాడు. నిర్మాత ఎస్‌ రాధాకృష్ణ పెట్టిన ప్రతి రూపాయి చాలా గ్రాండ్‌‌గా స్క్రీన్‌‌పై కనిపిస్తుంది.
 
విశ్లేషణ:
ఇంటర్వల్‌ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఈ మధ్యలో చాలా బోరింగ్‌‌గా ఉంటూ చాలా నెమ్మదిగా కథనం ముందుకు వెళ్తుంది. ఇంటర్వల్‌ బ్లాక్‌‌లో అందరూ ఏదో ఒక హై రేంజ్‌ ఎలిమెంట్‌‌ని కోరుకుంటారు, అలా కాకుండా చాలా చప్పగా ఇంటర్వల్‌ ఇవ్వడం ఆడియన్స్‌‌ని పెద్దగా మెప్పించలేదు. తర్వాత వచ్చే సీన్‌... 'మర్యాదరామన్న'లో అనుకోకుండా విలన్‌ ఇంట్లో ప్రవేశించినట్లుగా వుంది. అయినా కాస్త వేరియేషన్‌ హీరోతో చేయించాడు. ఉపేంద్రను తన పక్కన పనిచేసే వారే చంపేందుకు ప్రయత్నించడమనే కాన్సెప్ట్‌ చాలా సిల్లీగా వుంది. దాన్ని హీరో రక్షించడంతో చెల్లెల్ని ఇచ్చి పెండ్లికి సిద్ధం చేస్తాడు.. ఇదంతా చాలా సినిమాల్లో ఉన్నదే. కామెడీపరంగా పర్వాలేదు. సమంత పాత్ర... షుగర్‌ వ్యాధిగ్రస్తురాలైనా.. దాన్ని కామెడీగా చూపించాడు.  
 
ఇక ఈ సినిమాలో తను చెప్పాలనుకున్నది తల్లిదండ్రుల నుంచి వచ్చే విలువలే ఆస్తి అన్న పాయింట్‌ చెప్పాలనుకున్నాడు.. దానిని కన్విన్సింగ్‌‌గా చెప్పడం కోసం కొన్ని సన్నివేశాలను బలంగా రాసుకున్నాడు, కానీ అంత బలంగా కథని రాసుకోలేకపోయాడు. ఫ్యాన్స్‌ కోసం చేసిన ప్రయత్నమే అయినా... కుటుంబ విలువలు ఇలా వుండాలనే చెప్పే ప్రయత్నం గొప్పదే. సినిమా చూడ్డానికి ఓకే అనిపించేట్లుగా వుంటుంది. అయితే పాటల్లో ఎక్కడా కిక్‌ లేకపోవడంతో.. యూత్‌ను పెద్దగా ఎట్రాక్ట్‌ చేయలేకపోయింది. అవికూడా సరిగ్గా వుంటే.. ఫ్యాన్స్‌కు పండుగలా వుండేది.
 
రేటింగ్‌: 3/5