శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
Written By SELVI.M

"కెమేరా మాంత్రికుని"కి సినీ తారల నివాళి

WD

సీనియర్ ఛాయాగ్రాహకుడు వి.ఎస్.ఆర్ స్వామి (70) మంగళవారం ఉదయం తెల్లవారుజామున హఠాత్తుగా మరణించారు. మూడు రోజుల క్రితం కృష్ణాజిల్లా మచిలీ పట్నంలోని తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి స్వామి హాజరయ్యారు.

స్థానిక విజయరాఘవ రెసిడెన్సీలో బసచేసిన ఆయన, మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు ఆయన కుటుంబీకుల సమాచారం. స్వామి భౌతికకాయాన్ని వెంటనే చెన్నైలోని సౌత్‌గోగ్‌రోడ్‌లోని ఆయన నివాసానికి తరలించారు. బుధవారం నాడు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయను ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు.

ఇదిలా ఉండగా... స్వామి మరణించిన వార్తను వినిన ఆయన శిష్యులైన ఎస్.గోపాలరెడ్డి, ఎం.వి.రఘు, రాంప్రసాద్‌లు హుటాహుటిన చెన్నైకు బయలుదేరారు.

ఇకపోతే... కృష్ణాజిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడు స్వామి స్వగ్రామం. వి.ఎస్.ఆర్. స్వామికి చిన్నతనం నుంచి ఫోటోగ్రఫీపై ఆసక్తి ఎక్కువ. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన చిత్రాలకు ఎక్కువగా పనిచేశారు. అగ్రహీరోల చిత్రాలకు ఎక్కువగా పనిచేసిన ఏకైక ఛాయాగ్రాహకుడు కూడా ఆయనే. నిర్మాతగా స్వర్గీయ ఎన్టీఆర్ "ఎదురీత" అనే చిత్రాన్ని నిర్మించారు.

ఆ తర్వాత అనారోగ్యంతో కొంత కాలం స్వామి ఫోటోగ్రఫీకి దూరంగా ఉన్నారు. దర్శకత్వం చేయాలన్న కోరికతో రెండేళ్ళ క్రితం శ్రీకాంత్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్‌లో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. దురదృష్టవశాత్తూ అది కార్యరూపం దాల్చలేకపోయింది.

తన గురువైన సి. నాగేశ్వరరావు దగ్గర వి.ఎస్.ఆర్. స్వామి ఫోటోగ్రఫీలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లైన రవికాంత్ మెగా, ఎస్.శంకర్ దగ్గర పనిచేశారు. "బందిపోటు", "వీరాభిమన్యు" చిత్రాలకు కెమేరా ఆపరేటర్‌గా పనిచేశారు.

వీఎస్ఆర్ స్వామి తొలిసారి డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అయింది... కృష్ణ నటించిన "అసాధ్యుడు" చిత్రంతోనే. సినిమాటోగ్రాఫర్‌గా ఎన్నో ప్రయోగాలు చేశారు. "మోసగాళ్లకు మోసగాడు" (1971), "అల్లూరి సీతారామరాజు" (1974) 70 ఎం.ఎం చిత్రమైన "సింహాసనం" ఆయన నైపుణ్యానికి మచ్చుతునకలు. అందుకే ఆయనను "కెమేరా మాంత్రీకుడు" అని ఇండస్ట్రీలో పిలుస్తుంటారు.

హైదరాబాద్ వస్తానన్నారు: కృష్
ఇటీవలే ఆయన తనతో మాట్లాడారని, హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపారని సూపర్ స్టార్ కృష్ణ తెలియజేశారు. విజయకృష్ణ బేనర్‌లో పనిచేస్తానన్నారని, ఈ రోజు ఆయన మరణవార్త విని నమ్మలేక పోతున్నానన్నారు.

"గూఢచారి-116" సినిమాకు అసిస్టెంట్ కెమేరామెన్‌గా పనిచేశారని కృష్ణ వెల్లడించారు. తాను నటించిన "అసాధ్యుడు"కు ఛాయాగ్రాహకుడయ్యారు. మోసగాళ్లకు మోసగాడు, స్కోప్ చిత్రమైన అల్లూరి సీతారామరాజు చిత్రాలకు స్వామి పనిచేశారని కృష్ణ పేర్కొన్నారు.

90 శాతం తన చిత్రాలకే పనిచేశారని, "సింహాసనం" చిత్రంలో ఆయన కనబర్చిన కెమేరా నైపుణ్యం అద్భుతమన్నారు. ఆయన కుటుంబానికి కృష్ణ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

WD

పెద్ద షాక్: విజయ నిర్మ
పదిరోజులకు ముందే ఆయనతో మాట్లాడానని, తమ బేనర్‌పై కలిసి చేద్దామనుకునేలోపే ఇలాంటి వార్త వింటాననుకోలేదని విజయ నిర్మల చెప్పారు. ఇండస్ట్రీ మంచి ఛాయాగ్రాహకుడిని కోల్పోయిందని ఆమె అన్నారు. ఆయన లోటు తీర్చలేనిదని, ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నానని నిర్మల చెప్పారు.

ఛాయాగ్రాహానికి వన్నెతెచ్చారు : ఆర్. నారాయణ మూర్తి
దర్శకులు గర్వించే స్థాయిలో దాసరి దర్శకత్వ శాఖకు వన్నెతెస్తే... ఛాయాగ్రాహకుడిగా ఆ శాఖ గర్వించే స్థితిని కల్పించిన వ్యక్తి స్వామి అని నారాయణ మూర్తి కొనియాడారు. మంచి మనస్సున్న స్వామి దాసరిగారు రూపొందించిన "సీతారాములు" చిత్రానికి కెమేరా మేన్‌గా పనిచేశారని అందులో తాను వేసిన చిన్న వేషాన్ని స్వామి మెచ్చుకున్నారని నారాయణ మూర్తి ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత కొనాళ్లకు ఆయన రూపొందించిన "ఆపద్భాంధవులు" చిత్రంలో తనకు ప్రధాన పాత్ర ఇచ్చారని, అనివార్య కారణాల వల్ల అది విడుదలకు నోచుకోలేదన్నారు. ఆత్రేయగారు అన్నట్లు.... పోయినోళ్ళందరూ మంచోళ్ళు.. ఉన్నోళ్లు.. పోయినోళ్ళ తీపి గుర్తులు... అలా స్వామి తీపి గుర్తులను మిగిల్చారని నారాయణమూర్తి చెప్పారు.

వృత్తిలో ఆయనే ప్రేరణ: రాంప్రసాద
వృత్తిపరంగా తనకు ప్రేరణ కలిగించింది స్వామియేనని, ఆయన శిష్యుల్లో ఆఖరి వాడిని తానేనని, ఆయన చేసినన్ని అద్భుతమైన చిత్రాలని, వాటిని ఎవ్వరూ చేయలేరని రాంప్రసాద్ అన్నారు. ఆయన సక్సెస్ రూటే వేరని, స్వామి వంటి గురువుగారు లభించడం అదృష్టంగానూ, గర్వంగానూ భావిస్తున్నానని రాంప్రసాద్ తెలిపారు. అలాంటి వ్యక్తి ఇక లేడనడం తనను కలచివేసిందన్నారు.

మంచి మనిషి: ఎస్. గోపాల్ రెడ్డి
ఆయనతో 11 సంవత్సరాల సాన్నిహిత్యం ఉందని, మంచి మనసుగల వ్యక్తి అని, ఫోటోగ్రఫీలో ఎన్నో అధునాత పోకడలను స్వామి సృష్టించారని గోపాల్ రెడ్డి చెప్పారు. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లోనే కౌబాయ్, 70 ఎం.ఎం, జేమ్స్‌బాండ్ చిత్రాలను తన కెమేరా నైపుణ్యంతో బంధించారని, ఆయన లోటు వెండితెరకు తీర్చలేని లోటని గోపాల్ రెడ్డి చెప్పారు.

ఐరావతం లాంటి మనిషి: దర్శకుడు రాంప్రసాద
ఫోటోగ్రఫీకి స్వామి విలువల్ని పెంచారని, ఆయనతో రెండు సినిమాలకు పనిచేశానని, తన కెమేరా నైపుణ్యంతో అద్భుతాలు సృష్టించారని రాంప్రసాద్ వెల్లడించారు. లైటింగ్ సరిగ్గాలేనప్పుడు... కారు లైట్లతోనే చిత్రించిన సందర్భాలున్నాయని, తెరపై అవి చూస్తుంటే అద్భుతంగా ఉండేవని దర్శకుడు రాంప్రసాద్ అన్నారు. అందుకే ఆయనను ఐరావతం (ఎలిఫెంట్ వైట్) అనే వాళ్లమని, ఆయన మరణించడం తనను, సినీలోకాన్ని ద్రిగ్భాంతికి గురిచేసిందని చెప్పారు.

ఇంకా పలువులు సినీ ప్రముఖులు వి.ఎస్.ఆర్.స్వామి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. మహోన్నతమైన సాంకేతిక నిపుణుడ్ని కోల్పోవడం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు ఎన్. శంకర్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అందరూ స్వామి ఛాయాగ్రాహ తీరును చూసి నేర్చుకోవాలని శంకర్ హితవు పలికారు. స్వామి లోటు తీర్చలేనిదని ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కె.ఎస్. రామారావు పేర్కొన్నారు.