పాపం... కుర్ర హీరోయిన్లను వెంటాడుతున్న వరుస ఫ్లాపులు
తెలుగు చిత్రపరిశ్రమలో పలువురు యంగ్ హీరోయిన్లను వరుస ఫ్లాపులు వెంటాడుతున్నాయి. ఈ జాబితాలో కృతిశెట్టి, శ్రీలీల, భోగ్యశ్రీ బోర్సే, కయదు లొహర్ వంటి పలువురు కుర్రకారు హీరోయిన్లు ఉన్నారు. సాధారణంగా అభిమానుల మనసు దోచుకుంటూ, అవకాశాలను అందుకుంటూ, విజయాలను సొంతం చేసుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. ఇక్కడ హిట్టు తప్ప కథానాయికలను కాపాడే మరో మంత్రమే లేదు. ఒకపుడు హీరోయిన్స్ ఏళ్లతరబడి ఏలేవారు. కానీ, ఇపుడు ట్రెండ్ మారిపోయింది. ఎంత గ్లామరస్‌గా ఉన్నప్పటికీ ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ రెండుమూడు ఫ్లాపులు వరుసగా ఎదురైతే ఇక ఆ హీరోయిన్ కథ ముగిసినట్టే. మేకప్ కిట్ సర్దుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు.
గతంలో కృతిశెట్టి ఇచ్చిన ఎంట్రీ మామూలుగా లేదు. తాను నటించిన తొలి మూవీతోనే రూ.100 కోట్ల బ్యూటీగా మార్కులు కొట్టేసింది. అది అరుదైన ఫీట్‌గా ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కృతిశెట్టి కుదురుకున్నట్టేననిభావించారు. ఇంతలోనే ఆమెను వరుస పరాజయాలు పలుకరించాయి. ఆ తర్వాత కృతిశెట్టి ఎక్కడా కనిపించలేదు.
అలాగే, కెరీర్ ఆరంభం నుంచి వరుస హిట్లతో చెలరేగిపోయిన శ్రీలీల సంగతి కూడా అలాగే మారిపోయింది. శ్రీలీల జోరు తగ్గడానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ నేపథ్యంలో విశాలమైన నేత్రాలతో విన్యాసాలు చేసుకుంటూ భాగ్యశ్రీ బోర్సే తెరపైకి వచ్చింది. అమ్మాయి గ్లామర్‌కి వంకబెట్టవలసిన అవసరం లేదని ఆడియన్స్ అనుకున్నారు. కానీ, సక్సెస్ అనేక విధాలుగా ఆమెతో దోబూచులాడుతూనే వచ్చింది. దాంతో ఆమె కూడా ఇతర భాషా చిత్రాల వైపు అడుగులు వేయవలసి వచ్చింది. ఎంత అందంగా ఉన్నప్పటికీ టాలెంట్ ఉన్నా కొంత కాలం కూడా నిలదొక్కుకోలేకపోతుండటం కుర్ర హీరోయిన్లను కలవరపెడుతోంది.
