2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు
ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్, ఆయన మాజీ భార్య, నటి లిజి మళ్లీ కలిసిపోయారు. అయితే వీరిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కానీ, ఒకే ఇంట్లో కలిసివుంటున్నారు. గతంలో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న వీరిద్దరు ఇపుడు దశాబ్దం తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. అయితే, మళ్లీ పెళ్ళి చేసుకునే ఆలోచన మాత్రం లేదని ప్రియదర్శన్ స్పష్టం చేశారు.
గత 1990లో వివాహం చేసుకున్న ప్రియదర్శన్, లిజి 24 యేళ్ల వైవాహిక బంధం తర్వాత 2014లో విడిపోయారు. 2016లో వారి విడాకులు అధికారికంగా ఖరారయ్యాయి. అప్పట్లో తమ విడాకులకు అహం కారణమని ప్రియదర్శన్ చెప్పగా, తమ బంధంలో చాలా గొడవలు జరిగాయని, కోర్టు పోరాటం కూడా తీవ్రంగా సాగిందని లిజీ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియదర్శన్ మాట్లాడుతూ, ఒక్క మ్యారేజ్ సర్టిఫికేట్ మినహా మేమిద్దరం మునుపటి లాగే కలిసి జీవిస్తున్నాం. వివాహ ధృవీకరణ అనేది కేవలం ఒక కాగితంపై ఉండే విషయం మాత్రమే. స్నేహం, ఒకరికొకరు తోడుగా ఉండటమే ముఖ్యం అని తెలిపారు. తిరిగి పెళ్లి చేసుకునే ప్రణాళికలు ఏవీ లేవని తేల్చిచెప్పారు.
కాగా, ఈ దంపతుల పిల్లలైన నటి కళ్యాణి ప్రియదర్శిని, సిద్ధార్థ్ చొరవతోనే ఈ జంట మళ్లీ ఒక్కటైనట్టు కుటుంబ సన్నిహేతులు చెబుతున్నారు. దాదాపు 6 నుంచి 8 నెలల క్రితమే వీరిద్దరు కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవలే లిజీకి చెందిన స్టూడియోను సందర్శించిన మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టితో వారిద్దరు కలిసివుండటం గమనార్హం.
