మంగళవారం, 17 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 7 ఫిబ్రవరి 2026 (18:17 IST)

funky: విశ్వక్ సేన్ తో కె.వి. అనుదీప్ శైలి కామెడీతో ఫంకీ ట్రైలర్

Vishwak Sen,  Kayadu
Vishwak Sen, Kayadu
ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగు పెట్టనున్న 'ఫంకీ' చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, ‘ధీరే ధీరే’, ‘రట్టాటటావ్’ పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది.
 
'ఫంకీ' ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. కె.వి. అనుదీప్ శైలి కామెడీతో నవ్వులు పూయించింది. ప్రతి ఫ్రేమ్‌లో వినోదం ఉట్టిపడేలా రూపొందించిన ఈ ట్రైలర్, థియేటర్లలో నవ్వుల తుఫాన్ చూడబోతున్నామనే హామీ ఇచ్చింది. విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కలిసి తెరపై చురుకుగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరి.. చిత్రానికి కొత్త ఉత్సాహాన్ని, మరింత అందాన్ని జోడించింది. ప్రధాన తారాగణంతో పాటు ఇతర పాత్రలు కూడా నవ్వులు పూయిస్తూ 'ఫంకీ'ని పూర్తి స్థాయి వినోదభరిత చిత్రంగా మలిచాయి. మొత్తానికి ట్రైలర్ తో 'ఫంకీ' సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
 
వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "మీ అందరినీ కలిసి దాదాపు సంవత్సరం అవుతుంది. ఒక మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతోనే ఈ విరామం తీసుకోవడం జరిగింది. ఫంకీ సినిమా రెండు గంటల పది నిమిషాల పాటు మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటుంది. ఫోన్ పెట్టుకోవాలనే ఆలోచనే రాదు. ప్రతి సన్నివేశం చూస్తూ నవ్వుకుంటారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్ కి రండి. కడుపుబ్బా నవ్వుకుంటారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో కలుద్దాం." అన్నారు.
 
కథానాయిక కయాదు లోహర్‌ మాట్లాడుతూ.. "మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. ట్రైలర్ చూశారు కదా ఎంత కామెడీగా ఉందో. సినిమా దీనికి వంద రెట్లు ఉంటుంది. అనుదీప్ గారి ట్రేడ్ మార్క్ కామెడీ చూస్తారు. నాకు ఈ అవకాశమిచ్చిన నాగవంశీ గారికి ధన్యవాదాలు. ఫిబ్రవరి 13న విడుదలవుతున్న మా ఫంకీ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను." అన్నారు. 
 
దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ.."ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫిబ్రవరి 13న థియేటర్ కి రండి. ఫంకీ సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది." అన్నారు.
 
సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.."ట్రైలర్ మీ అందరికీ నచ్చింది కదా. పంచ్ లు బాగా పేలాయి కదా. సినిమా అంతా ఇలాగే ఉంటుంది. ప్రతి సన్నివేశం మిమ్మల్ని నవ్విస్తుంది. కామెడీ కోసం థియేటర్ కి రండి. దర్శకుడు అనుదీప్ మిమ్మల్ని అసలు నిరాశపరిచాడు. జాతిరత్నాలుతో ఎలా ఆకట్టుకున్నాడో ఫంకీతో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటాడు. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఫంకీ సినిమా ఖచ్చితంగా నవ్విస్తుంది." అన్నారు.