నిర్మాత మేనేజర్ లా వ్యవహరిస్తేనే లాభపడతాడు :చింతా గోపాల కృష్ణా రెడ్డి
Vamsi Thummala, Sandhya Vashisht - Chinta Gopal Krishna Reddy
కిరణ్ అబ్బవరం తో -క - చిత్రాన్ని నిర్మించిన చింతా గోపాల కృష్ణా రెడ్డి ఇప్పుడు కొత్త దర్శకుడు వినయ్ రత్నం తో శ్రీ చిదంబరం గారు అనే సినిమా నిర్మించారు. ఇది ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత పలు విషయాలను ఇలా తెలియజేస్తున్నారు.
- క్రౌడ్ ఫండింగ్ తో సినిమా తీయాలని ఆలోచనతో రాజమండ్రి బాయ్స్ పేరుతో షార్ట్ ఫిలింస్ చేసి పేరు తెచ్చుకున్న వినయ్ రత్నం ఓసారి ఆన్ లైన్ లో పెట్టిన ఐడియాను చూశాం. ముందుగా మా అమ్మాయి చూసి పాయింట్ బాగుందని చెప్పింది. వీరికి ఒక అవకాశం ఇవ్వాలని అనుకుని సినిమా ఛాన్స్ ఇచ్చాం.
- క.. సినిమా అయినా అప్పట్లో దర్శకుడు కొత్తవాడు. పైగా హీరోకు మూడు సినిమాలు ప్లాప్. అలాంటి వారిని ఎంకరేజ్ చేయాలని సినిమా చేశాం. ఆ సినిమా చేసేటప్పుడు అపర కుబేరులం అన్న వారు పలువురు ఎందుకు మీకు రిస్క్ అని కూడా తెలిపారు. కానీ నాకు సినిమా అంటే పేషన్. 11 సంవత్సరాల నుంచి సినిమా తీయాలనే కోరిక బలంగా వుండేది. అందుకే కథ నచ్చి, కొత్తవారి కష్టాలు చూసి వారికి ఎంకరేజ్ చేయాలని సినిమా నిర్మాతగా మారాను.
- మాకు సెపరేట్ టీమ్ లేదు. నేను, నా భార్య, కుమార్తె ముగ్గురం కలిసి కథ వింటాం. మాకు నచ్చితే వెంటనే సెట్ పైకి వెళుతుంది. సినిమా నిర్మాణంలో పెద్దగా అనుభవంలేదు. కానీ మంచితనం, నమ్మకం, పట్టుదలను నేను నమ్ముతాను.
- ముందు తీసిన సినిమాల ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. కొన్ని అనుభవాలు పాఠాలుగా నేర్పించాయి. రూపాయితో అయ్యేది 10 రూపాయలు అయ్యేంతగా అనుకోకుండా ఖర్చు పెట్టాల్సిన అవసరం వుంటుంది. నా ద్రుష్టిలో నిర్మాత అనేవాడు మేనేజర్ లా వుండాలి. అప్పుడే అన్నింటిలో నియంత్రణ వుంటుంది. నా సినిమాలకు నేను అలానే వుంటాను.
- ఇక, శ్రీ చిదంబరం గారు సినిమా టైటిల్ అనేది గౌరవంగా క్యారెక్టర్ పరంగా వుండాలని పెట్టాం. ఇది మలయాళ సినిమాను కథగా దర్శకుడు రాసుకున్నారని వార్తలు కూడా విన్నాను. ఏదిఏమైనా మలయాళంలో ఆ సినిమాను చూశారు గదా. తెలుగులో అందమైన లొకేషన్లలో మేం తీశాం. ఇంతవరకు ఎక్కడా అలాంటి లొకేషన్లు తీయలేదు. ట్రైలర్ చూశాక.. ఇండస్ట్రీలోని కొందరు ఇలాంటి లొకేసన్లు ఎక్కడ వున్నాయని మమ్మల్ని అడిగారు కూడా.
- సినిమా పరిశ్రమలో సీనియర్లు కూడా నిర్మాణంలో దెబ్బతిన్నారు. వారి నుంచి పాాఠాలు నేర్చుకుని నిర్మాణం చేపడుతున్నా. ఏడాదికి రెండు సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నా. రావు బహదూర్ అనే సినిమా షూటింగ్ లో వుంది. మరో కొత్త దర్శకుడితో త్వరలో సినిమా ప్రారంబిస్తున్నా.అని తెలిపారు.