విమాన ప్రమాదంలో చనిపోతే.. నా చివరి చిత్రం మాత్రం ఆపొద్దు : అమీర్ ఖాన్
విమాన ప్రమాదంలో తాను చనిపోతే నేను నటించిన చివరి చిత్రం మాత్రం విడుదల చేయకుండా ఆపొద్దని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నారు. ఆయన తన సోదరుడు మన్సూర్ ఖాన్‌కు ఓ సీక్రెట్ లేఖ రాశారు. తాను విమానం ఎక్కే ముందు.. అంటే ప్రతి విమాన ప్రయాణానికి ముందు ఓ సీక్రెట్ నోట్‌ను తన సోదరుడుకు పంపుతుంటాడు. ఆ ప్రయాణంలో తనకు ఏమైనా జరిగితే తాను నటించిన చివరి చిత్రాన్ని మాత్రం ఆపొద్దు అంటూ చెబుతానని తాజాగా వెల్లడించారు.
'ఏదైనా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడు నేను విమాన ప్రయాణం చేయాల్సి వస్తే ఖచ్చితంగా మన్సూర్‌కు ఒక సీక్రెట్ నోట్ పంపుతాను. ఒకవేళ ఈ విమానం కూలిపోయి నేను చనిపోతే.. ఆ సినిమా పనులు నువ్వు చూసుకో అని నోట్ సెండ్ చేస్తాను. అలాగే దర్శకులతో కూడా ఇదే విషయాన్ని చెబుతాను. నాకు ఏమైనా అయినా సినిమాను ఆపేయొద్దని.. మన్సూర్ సలహాలతో దాన్ని పూర్తి చేసి విడుదల చేయాలని కోరతా అని చెప్పారు.
విమాన ప్రయాణం ఎప్పుడు చేసినా తనకేమైనా అవుతుందేమోనన్న భయం ఉంటుందని అమీర్ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ఆయనకు సినిమాపై ఉన్న నిబద్ధతను నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రముఖ దర్శకుడు మన్సూర్ ఖాన్, అమీర్ ఖాన్ బంధువులే. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో 'ఖయామత్ సే ఖయామత్ తక్', 'జో జీతా వహీ సికందర్' వంటి హిట్ సినిమాలు వచ్చాయి. తాజాగా అమీర్ ఖాన్ తనయుడు జునైద్ నటించిన 'ఏక్ దిన్' చిత్రాన్ని మన్సూర్ నిర్మించారు.
