1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. actress radhika emotional post on bharathiraja death

'మీరే నా సర్వస్వం..' - భారతీరాజా మృతిపై నటి రాధిక ఎమోషనల్ పోస్ట్

radhika - bharathiraja
సినీ దర్శకుడు భారతీరాజా మృతిపై సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. భారతీరాజాతో ఆమెకు విడదీయరాని అనుబంధం ఉంది. భారతీరాజాను ఆమె తన గురువుగా భావిస్తారు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఆయనపై ఉన్న అభిమానాన్ని వెల్లడిస్తూనే ఉంటారు. ఇపుడు తన గురువు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆయనతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. 'మీరే నా సర్వస్వం..' అని రాసుకొచ్చారు. ఆయన లేరని తెలిసి తన హృదయం ముక్కలైందన్నారు. ఆమె చేసిన పోస్ట్‌లో... 
 
'నన్ను తీర్చిదిద్దిన వ్యక్తులు ఇద్దరు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వాళ్లే. ఒకరు నా తల్లి, మరొకరు నా గురువు భారతీరాజా. ఒక్క ఏడాదిలోనే వీళ్లిద్దరినీ నేను కోల్పోయాను. ఈ వేదనను మాటల్లో వివరించలేకపోతున్నాను. ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. హృదయం బరువెక్కింది. నా బాధను అర్థం చేసుకుని, నాతో పాటు నిలబడి, అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ నేను తలవంచి నమస్కరిస్తున్నాను. వారి జ్ఞాపకాలు, వారు నాకు నేర్పిన జీవిత పాఠాలు నాతో ప్రయాణిస్తూనే ఉంటాయి' అని రాసుకొచ్చారు. ఇక సినీ వేడుకల్లో భారతీరాజా అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పిన వీడియోను ఆమె పంచుకున్నారు. 'భారతీరాజా సర్‌.. మీరే నా సర్వసం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి' అని క్యాప్షన్‌ పెట్టారు.
 
రాధికను ఇండస్ట్రీకి పరిచయం చేసింది భారతీరాజానే. 1977లో వచ్చిన తమిళ మూవీ '16 వయథినిలే'తో దర్శకుడిగా మారిన ఆయన తన రెండో సినిమా 'కిళక్కే పొగమ్‌ రైల్‌'తో రాధికను నటిగా కోలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆ సినిమా హిట్‌ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆమెను స్టార్ హీరోయిన్‌గా తీర్చిదిద్దిన గురువుగా భారతీరాజాపై రాధికకు అపారమైన గౌరవం ఉంది. ఆయన కూడా తన విజయాల్లో రాధిక భాగమని ఎప్పుడూ చెప్పేవారు. ఇటీవల కూడా రాధిక ఆయన్ని కలవగా.. ఆమె నటించిన 'తాయ్‌కిళవి'కి నేషనల్‌ అవార్డు వస్తుందని ప్రోత్సహించారు. 'వస్తే మీ పాదాల దగ్గర పెడతాను' అని ఆమె తన గురువుపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం రాధిక షేర్‌ చేసిన పోస్ట్‌లు వైరల్‌ అవుతున్నాయి. 


 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Balakrishna: బాలకృష్ణ పుట్టినరోజున NBK111 టీజర్‌ చూస్తూ ఆనందించిన కుటుంబసభ్యులు