బుధవారం, 12 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 నవంబరు 2025 (17:40 IST)

నయనికతో అల్లు శిరీష్ నిశ్చితార్థం - మెడలో నెక్లెస్ ధరించిన వరుడు

Allu Sirish
టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్‌కు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఆయన త్వరలోనే నయనిక అనే యువతిని వివాహం చేసుకోనున్నారు. అయితే, నిశ్చితార్థ వేడుకలో అల్లు శిరీష్ మెడలో నెక్లెస్ ధరించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. పైగా, నెటిజెన్స్ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అయితే, ఈ ట్రోల్స్‌కు హీరో శిరీష్ గట్టిగా బదులిచ్చారు. చారిత్రక ఆధారాలను చూపిస్తూ తనదైనశైలిలో విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చారు.
 
నిశ్చితార్థ వేడుకలో శిరీష్ మెడలో నెక్లెస్ కనిపించడమే చర్చనీయాంశంగా మారింది. మగవాళ్ళు నెక్లెస్ ధరించడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు మాత్రం మీమ్స్, ట్రోల్స్ రూపంలో దండెత్తారు. ఈ నెక్లెస్ ధర రూ.10 వేల డాలర్లు ఉంటుందనే ప్రచారం కూడా చేస్తున్నారు. తనపై వస్తున్న విమర్శలు, మీమ్స్‌పై అల్లు శిరీష్ ఎక్స్ వేదికగా స్పందించారు.
 
మన తెలుగు మీమ్స్ చాలా సరదాగా ఉన్నాయి. చోకర్లను మన భారతీయ మహారాజులు, మొఘలులు కూడా ధరించారు. పూర్వకాలంలో రాజులందరూ చోకర్లు పెట్టుకునేవారు అంటూ కౌంటరిచ్చారు. తన వాదనకు బలంగా చోకర్లు ధరించిన మహారాజుల ఫోటోలను కూడా ఆయన షేర్  చేశారు. అంతటితో ఆగకుండా నెక్లెస్‌కే ఇలా అయిపోతే, పెళ్ళికి వడ్డాణం పెట్టుకుంటే ఏమైపోతారో అంటూ ఓ సరదా మీమ్‌ను కూడా పంచుకున్నారు.