జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ
బుల్లితెర యాంకర్, సినీ నటి అనసూయ జూమ్ కాల్‌లో బోరున విలపించారు. మనమంతా మనుషులమేనని, ఒక మనిషిగా భావోద్వేగానికి లోనవ్వడంలో తనకెలాంటి సిగ్గూ లేదని పేర్కొన్నారు. తాజాగా జరిగిన జూమ్ ప్రెస్‌మీట్‌లో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. దీనిపై ఇన్‌స్టా వేదికగా ఆమె వివరణ ఇచ్చారు. 'నిన్న జూమ్ కాల్ ద్వారా ప్రెస్‌మీట్‌లో మాట్లాడాను. ఆ సమయంలో నాకు లభించిన మద్దతు నన్నెంతో భావోద్వేగానికి గురి చేసింది.
అదేసమయంలో కొంతకాలంగా నేను అనారోగ్యంతో ఉండటంతో, ఆ బలహీన క్షణంలో కన్నీళ్లు ఆగలేదు. నేను పూర్తిగా బాగున్నా. మన స్వయం నిర్ణయాధికారానికి మద్దతుగా మాట్లాడినందుకు ఇలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవడం నిజంగా బాధాకరం. అయితే, నా వెనుక నిలబడ్డ అద్భుతమైన, బలమైన మహిళల వల్ల నాకు అపారమైన ధైర్యం లభిస్తోంది' అని పేర్కొన్నారు.
'నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా బూడిద నుంచి మళ్లీ లేచి, అన్ని అడ్డంకులకు ఎదురొడ్డి నిలబడతాను. బలహీన క్షణాలను ఆసరాగా చేసుకుని లాభపడాలని చూస్తారో, అది వారి స్వభావాన్ని మాత్రమే చూపిస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియాలోని కొన్ని వర్గాలపై నా నమ్మకం క్రమంగా తగ్గుతున్నా, మన న్యాయ వ్యవస్థపై మాత్రం నమ్మకం ఉంది. అంత వరకూ క్లిక్ బైట్ కథనాలకు, ఊహాగానాలకు దూరంగా ఉండాలని అందరినీ కోరుతున్నా. మంగళవారం జరిగిన ప్రెస్ మీట్‌లో, నేను అక్కడ లేకపోయినా, ధైర్యం, ఐక్యతతో మాట్లాడిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు.