1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. AP CM Pawan Kalyan expressed deep sorrow over the passing of legendary filmmaker Singeetham Srinivasa Rao

విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు సింగీతం శ్రీనివాస రావు : పవన్ కళ్యాణ్

singeetam srinivasa rao
దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాస రావు విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నో ప్రయోగాలు చేసి సినీ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలు లిఖించిన సింగీతం... శనివారం రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. ఆయన మృతికి సినీ ప్రముఖులు తమ సంతాపం తెలుపుతూ, ఆయనతో తమకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. 
 
'ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారని తెలిసి విచారిస్తున్నాను. భారతీయ చలన చిత్రపరిశ్రమలో విభిన్న కథలు రూపొందించారు. పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మయూరి, ఆదిత్య 369 లాంటి చిత్రాల్లో సింగీతం చేసిన ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి. 94 ఏళ్ల వయసులోనూ 'సింగ్ గీతం' అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ఆయనకి సినిమాపై ఉన్న ఆసక్తికి నిదర్శనం' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 
 
'భారతీయ సినీ రంగానికి సింగీతం శ్రీనివాసరావు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి' అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 
 
'సింగీతం శ్రీనివాసరావు ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరం. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి.. ఇలా కాలానికంటే ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడు సింగీతం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. 
 
'మిమ్మల్ని జీవితమంతా మిస్‌ అవుతూనే ఉంటాను. మీరు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతారు. మీరు సాటిలేని దిగ్గజం.. నిత్య యవ్వనంతో నిండిన పాజిటివిటీకి మీరు ఒక ఎవరెస్ట్ శిఖరం.. మీ సినిమాలు మా అందరికీ, అలాగే భవిష్యత్తు తరాలకు కూడా పాఠాలు. మీతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా' అని ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సింగీతం యవ్వనంతోపాటే తుదిశ్వాస విడిచారు : కమల్ హాసన్