గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

భారత్ నాకు స్ఫూర్తి - నా దేశం నా గురువు - నా ఇల్లు కూడా : ఏఆర్ రెహ్మాన్

ar rehman
భారతదేశం తనకు స్ఫూర్తి అని, తన దేశం తన గురువు, తన ఇల్లు కూడా  అని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అన్నారు. కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. తన మాటలతో ఎపుడూ ఎవరినీ బాధ పెట్టాలని కోరుకోలేదన్నారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సంగీతమనేది ఎల్లవేళలా దేశ సంస్కృతిని అనుసంధానించేందుకు వేడుకగా చేసుకునేందుకు, గౌరవించేందుకు ఒక మార్గంగా ఉందని తెలిపారు. 
 
'భారత్‌ నాకు స్ఫూర్తి. ఈ దేశం నా గురువు, ఇల్లు కూడా. భారతీయుడిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. నా భావాలను స్వేచ్ఛగా ప్రకటించే, భిన్న స్వరాలతో పనిచేసే అవకాశాన్ని ఈ దేశం కల్పించింది. కొన్నిసార్లు ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని తెలుసుకున్నాను. సంగీతం ద్వారా ఉత్తేజపరచడం, గౌరవించడం, సేవ చేయడమే నా లక్ష్యం. ఎప్పుడూ ఎవరికీ బాధ కలిగించాలని కోరుకోలేదు. నా నిజాయతీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
 
వేవ్స్‌ సమిట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట ప్రదర్శించిన 'ఝాలా' సంగీతం నుంచి.. యువ నాగా సంగీతకారులతో కలిసి పనిచేయడం వరకు, దేశంలో మొట్టమొదటి మల్టీకల్చరల్‌ వర్చువల్ బ్యాండ్‌ను సృష్టించడం నుంచి.. హాన్స్ జిమ్మర్‌తో కలిసి రామాయణం సినిమాకు సంగీతం అందించడం వరకు.. ప్రతి ప్రయాణం నా లక్ష్యాలను బలపర్చింది అని ఏఆర్‌ రెహమాన్‌ పేర్కొన్నారు.
 
రెహమాన్‌ ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ‘బాలీవుడ్‌లో తమిళ్‌ లేదా మహారాష్ట్రేతరులపై పక్షపాతం ఉంటుందా?’ అని ప్రశ్నించగా.. వ్యక్తిగతంగా తానెప్పుడూ ఎలాంటి వివక్షను ఎదుర్కొలేదని తెలిపారు. 'ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో 'పవర్‌ షిఫ్ట్‌' నెలకొంది. సృజనాత్మకత లేని వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీనికి మతపరమైన అంశం ఓ కారణమై ఉండొచ్చు. అది నాకు నేరుగా ఎదురుకాలేదు గానీ.. గుసగుసలు వినిపించాయి. నేను పని కోసం వెతకను. చిత్తశుద్ధి ఉంటే పనే మన వద్దకు వస్తుందని విశ్వసిస్తా' అని రెహ్మాన్ వ్యాఖ్యానించారు.