కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే
ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఇకలేరు. 92 యేళ్ల వయసులో ఆమెకు గుండెపోటు, ఛాతిలో ఇన్ఫెక్షన్ సోకడంతో శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. అయితే, తన గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఆశా భోంస్లే... నిజ జీవితంలో జరిగిన ఒక తీరని విషాదం ఆమెను జీవితాంతం వెంటాడింది. అదే ఆమె కుమార్తె వర్షా భోంస్లే. ఈ ఘటనతో ఆశా భోంస్లే మానసికంగా కుంగిపోయింది.
గత 2012 అక్టోబరు 8వ తేదీన వర్షా భోంస్లే ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. గాయనిగా, కాలమిస్ట్‌గా పని చేసిన వర్షా భోంస్లే... కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడ్డారు. 1998లో భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తన తల్లివద్దనే ఉన్నారు. అంతకుముందు 2008లో కూడా ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
2012లో ఆత్మహత్య సంఘటన జరిగిన రోజు వర్ష తన గదిలోని సోఫాలో రక్తపు మడుగులో పడివుండటాన్ని డ్రైవర్, పని మనిషి గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. ఆమె లైసెన్స్‌డ్ పిస్టల్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. ఆ సమయంలో ఆశా భోంస్లే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు సింగపూర్‌లో ఉన్నారు. కుమార్తె మరణవార్త విని ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
తన కుమార్తె మరణం తన జీవితంలో అతిపెద్ద దెబ్బ అని, ఆ వేదనను తన చివరి శ్వాస వరకు మరిచిపోలేనని ఆశా భోంస్లే పలు సందర్భాల్లో చెబుతూ ఆవేదన చెందారు. వేదికపై ఎంతో ఉత్సాహంగా కనిపించే ఆశా భోంస్లే, తన వ్యక్తిగత జీవితంలో కుమార్తెను కోల్పోయిన దుఃఖాన్ని మోస్తూనే గడిపారు. ఈ విషాదం ఆమె జీవితంలో ఎప్పటికీ మాయని గాయంగా మిగిలిపోయింది.
