గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2025 (16:49 IST)

B. Nagi Reddy: బి.నాగిరెడ్డి జీవితమే ఓ గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథం.

BN Reddy -Vijaya studio
BN Reddy -Vijaya studio
బి.నాగిరెడ్డి గారు తెలుసా మీకు? అని అడిగితే పాపం అవుతుంది. ఆయన గురించి ఏం తెలుసు?  అని అడిగితే దోషం అవుతుంది. ఒక సినిమా సగంలోంచి చూస్తే ఎలా అర్థంకాదో,  బి.నాగిరెడ్డి గారు లాంటి  మహానుభావుల గురించి తెలుసుకోకపోతే  తెలుగు సినిమా చరిత్ర  అస్సలు అర్థం కాదు.  ‘పాతాళ భైరవి’, ‘మాయాబజార్’, ‘మిస్సమ్మ’ వంటి కళాఖండాలు తీశారనో - 
 

ఆసియాలోనే అతి పెద్ద స్టూడియో ‘విజయా వాహినీ’ కట్టారనో- విజయా’ సంస్థతో తెలుగు సినిమాకు స్వర్ణయుగం చూపించారనో -  జగమెరిగిన బాలల పత్రిక ‘ చందమామ’ సంస్థాపకులనో- ఓ గొప్ప నిర్మాతగానే కాదు - అసలు బి.నాగిరెడ్డి గారి జీవితమే ఓ గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథం.
 
ఉల్లిపాయల వ్యాపారం చేసినవాడు- వీధుల్లో పోస్టర్లు కట్టినవాడు - అందంగా శుభలేఖలు అచ్చు వేయించినవాడు - ఊరూరా తిరిగి ఖద్దరు అమ్మినవాడు- తెలుగు సినిమా జెండాపై కపిరాజు కాగలిగాడు. అసలు ఇదంతా బి.నాగిరెడ్డి గారికి  ఎలా సాధ్యపడింది? ఆ నిజాలు తెలియాలన్నా - ఆ చరిత్ర సాక్షాత్కారం కావాలన్నా - ఒక్కటే మార్గం.
“B.Nagi Reddi - A Son's Memoir”అని ఆంగ్లంలో  ఒక పుస్తకం తాజాగా విడుదలైంది. 
 
రాసింది నాగిరెడ్డి గారి మూడో తనయుడు విశ్వం అనబడే విశ్వనాథరెడ్డి గారు. తన తండ్రి తాలూకు జీవన పర్వాన్ని- ఒడిదొడుకుల్ని, కష్టాల్ని ఎదురొడ్డిన తీరుని- ఎన్నెన్నో తీపి చేదు గుర్తుల్ని-జయాపజయాల ఘట్టాల్ని- కళ్లకు కట్టినట్టుగా ఓ స్క్రీన్ ప్లేతో అధ్యాయాల వారీగా ఆవిష్కరించారు. ఈ గ్రంథానికి కన్సెల్టెంట్ ఎడిటర్ ఆరితేరిన కలం యోధుడు ఎమ్మెల్ నరసింహం.
 
బి.నాగిరెడ్డి తీసినవన్నీ బ్లాక్ అండ్ వైట్ అద్భుతాలే.  దాన్ని గుర్తు చేస్తున్నట్టుగా  ఈ పుస్తకానికి బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌లో మంచి కవర్ పేజీ డిజైన్ చేయించారు. లోపల పేజీలన్నీ తెల్ల మల్లెపువ్వుల్లా  ఆ కాలపు జ్ఞాపకాలను గుబాళింపజేస్తాయి. మీరూ ఆస్వాదించండి.
 
మచ్చుకు ఈ పుస్తకంలోని  ఓ సంఘటన వివరిస్తాను.
నాగిరెడ్డి గారు షూటింగ్ లొకేషన్‌లో ఉండటం తక్కువే.  ఆ వ్యవహారాలన్నీ ఆయన ప్రాణ స్నేహితుడు - నిర్మాణ భాగస్వామి చక్రపాణి గారు చూసుకుంటారు. ఆరోజు  ఎందుకనో లొకేషన్‌లో ఉన్నారు నాగిరెడ్డి.  విజయా స్టూడియోలో వేసిన సెట్‌లో ‘గుండమ్మ కథ’ తమిళ వెర్షన్ షూటింగ్ చేస్తున్నారు.  హోటల్ సీన్.  జెమినీ గణేశన్ టిఫిన్ చేయడానికో, భోంచేయడానికో ఆ హోటల్‌కి వస్తారు.అక్కడున్న సర్వర్ గమ్మత్తుగా బిహేవ్ చేస్తాడు. చాలా చిన్న వేషం అది. 
 
నాగిరెడ్డి గారికి ఆ సర్వర్ వేషం వేసిన కుర్రాడి చురుకుతనం, సీన్‌ని ఇంప్రవైజ్ చేయడం బాగా నచ్చేసింది. ఆ తర్వాత అదే సీన్ ని తెలుగు వెర్షన్ కోసం ఎన్టీఆర్‌తో తీస్తున్నారు.  ఆ కుర్రాణ్ణే ఆ పాత్ర చేయమన్నారు నాగిరెడ్డి.  తర్వాత అతన్ని పిలిచారు.
 ‘‘మీకు పారితోషికం ఎంత మాట్లాడారు’’ అనడిగారు.  ‘‘500 రూపాయలు అని చెప్పారండీ’’ అని వినయంగా చెప్పాడు.  ఇంకా అతని వివరాలు కనుక్కున్నారు. 
 
అతను ఈ మధ్యనే బాలచందర్ సినిమాలో చిన్న వేషం వేశాడట. వారం రోజుల్లో అతని పెళ్లి. పెద్దలకు తెలియకుండా అతను ప్రేమించిన క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. 
 
నాగిరెడ్డి గారు క్యాషియర్‌ని పిలిచి, అతనికి వెయ్యి రూపాయలకు బేరర్ చెక్ ఇప్పించారు. అతను ఆశ్చర్యంగా చూస్తుంటే, ‘‘తమిళంతోపాటు తెలుగు వెర్షన్ కూడా చేశారు కదా, అందుకే వెయ్యి రూపాయలు’’ అని నాగిరెడ్డి గారు చెప్పగానే, అతను చాలా సంబరపడిపోయాడు. 
 
ఆ నటుడు తర్వాత తమిళ ఇండస్ట్రీని ఏలాడు. తెలుగునాట కూడా బాగా పాపులర్.  ఆయనే నగేష్.  ఈ సందర్భాన్ని నగేష్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు కూడా. ‘గుండమ్మ కథ’లో నగేష్ అలా ఓ చిన్న వేషం వేసిన విషయం ఇప్పటి వరకూ ఎవరికీ తెలీదు.
ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. 252 పేజీల ఈ పుస్తకం వెల: 500 రూపాయలు.
 ప్రారంభ ఆఫర్‌గా డిసెంబర్ 31 లోపు కొనుక్కుంటే, 400 రూపాయలకే లభిస్తుంది.
వివరాలకు: విజయా పబ్లికేషన్స్, చెన్నై ఫోన్ నెం: 044-23652007, E-Mail: [email protected]