1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Chiranjeevi pens adorable birthday wish to Pawan Kalyan

తెలుగు ప్రజలు మెచ్చే నాయకుడుగా ఎదగాలి : తమ్ముడుకు అన్నయ్య బర్త్‌డే విషెస్

pawan - chiranjeevi
తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు మెచ్చే నాయకుడుగా ఎదగాలంటూ ఆయన ఆకాంక్షించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పనితీరుపై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ సుధీర్ఘ పోస్ట్ చేశారు. 
 
అచంచలమైన విశ్వసనీయతతో కూడిన ప్రేమ, బాధ్యతాయుతమైన సంకల్పం, ప్రతి క్షణం ప్రజలకు మేలు చేయాలనే స్వచ్ఛమైన తపన.. ఇవన్నీ మన కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ నేను చూస్తున్న లక్షణాలు. ఆయన ఏ పని చేపట్టినా అందులో పూర్తిగా లీనమైపోతారు. పది మందికి మేలు చేయాలనే బలమైన ఆకాంక్షతో ప్రతి అడుగు వేస్తారు.
 
మన కుటుంబం పట్ల ఆయన చూపే ప్రేమను, తనను నమ్మిన ప్రజల పట్ల కూడా అంతే ఆప్యాయతతో చూపిస్తారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, గ్రామ అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల కనీస అవసరాల తీర్పు వంటి అంశాలపై అంకితభావంతో పనిచేస్తూ, పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు.
 
ఏళ్ల తరబడి పరిష్కారం లేకుండా మిగిలిపోయిన అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడం, మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధిని తీసుకెళ్లడం చూస్తుంటే నాకు ఎంతో ఆనందం, గర్వం కలుగుతాయి. తనను ఎన్నుకున్న పిఠాపురం ప్రజలకు, ఆయన కేవలం ప్రజాప్రతినిధిగానేకాకుండా, ఒక కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారు. 
 
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరి ఆదరణ పొందే నాయకుడిగా ఎదిగే క్రమంలో... ఆయన వేసే ప్రతి అడుగులోనూ విజయం లభించాలని కోరుకుంటున్నాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, ఉత్సాహంతో నూరేళ్లు జీవించాలని, మరింత శక్తిసామర్థ్యాలతో ప్రజాసేవకు తనను తాను అంకితం చేసుకోవాలని మన కులదైవం శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను... మన కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ చిరంజీవి బర్త్ డే విషెస్ చెప్పారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Mamitha Baiju: అరుదైన మైలురాయిని అందుకున్న హీరోయిన్ మమితా బైజు