1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Deeply saddened by the passing of legendary filmmaker Sri Singeetham Srinivasa Rao Ji.

సింగీతం యవ్వనంతోపాటే తుదిశ్వాస విడిచారు : కమల్ హాసన్

singeetam
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం పట్ల సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయన మృతి భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని సినీ ప్రముఖులు కొనియాడుతున్నారు. అగ్ర నటులు కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఘనంగా నివాళులు అర్పించారు.
 
'సింగీతం గారు కోరుకున్నట్లే తనలోని యవ్వనంతో పాటే తుదిశ్వాస విడిచారు. ఆయనలోని ఆ యువతత్వం అందరికీ లేదు. ఆ లక్షణం అందరికీ అబ్బాలని ఆయన చేయి పట్టుకుని నడిచిన స్నేహితులు, శిష్యుల్లో నేనూ ఒకడిని. ఆయన్ని కలిసినప్పటి నుంచి ఎంతో ఆరాధిస్తున్నా. ఇప్పుడు ఆయనలా జీవించాలని ఆశిస్తున్నా' అని కమల్ హాసన్ పేర్కొన్నారు. 
 
'మా నాన్నగారు తొలిసారి శ్రీకృష్ణుడిగా నటించిన ‘మాయాబజార్’ చిత్రానికి దర్శకుడు కె.వి.రెడ్డి దగ్గర సింగీతం గారు సహాయకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత నాన్నగారి ఎన్నో చిత్రాలకు ఆయన పనిచేశారు. అలా మా కుటుంబంతో ఆయనకు సినిమా రంగానికి అతీతమైన ప్రత్యేక బంధం ఏర్పడింది. 
 
మేమిద్దరం కలిసి మూడు అద్భుతమైన క్లాసిక్ చిత్రాలు చేశాం. భారతీయ సినిమాకే కొత్త ముద్ర వేసిన ‘ఆదిత్య 369’, తెలుగులో తొలి కంప్యూటర్ గ్రాఫిక్స్ చిత్రంగా చరిత్ర సృష్టించిన జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’, పౌరాణిక చిత్రం ‘శ్రీ కృష్ణార్జున విజయం’.. ఈ మూడూ ఎంతో ప్రత్యేకం. ఒకే దర్శకుడి సారథ్యంలో నేను చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించాను. 
 
ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను. తుదిశ్వాస విడిచే వరకూ ఆయన వివిధ భారతీయ భాషల్లో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన మరణం తీరని నష్టం. నందమూరి కుటుంబం తరపున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అని నందమూరి బాలకృష్ణ అన్నారు. 
 
'సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఒక గొప్ప దార్శనికుడు. కొత్త ఆలోచనలను అన్వేషించడంలో ఆయనకున్న ధైర్యం, అద్భుతమైన ఊహాశక్తి.. భారతీయ సినిమాకు ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాలను అందించాయి. సినీ రంగానికి ఆయన చేసిన విశేష కృషిని ఎప్పటికీ ఎంతో గౌరవంతో, ఆప్యాయతతో గుర్తుంచుకుంటాం. ఇటీవల ఆయన తెరకెక్కించిన 'సింగ్ గీతం' చిత్రం.. కథల పట్ల ఆయనకున్న అంతులేని తపనకు అద్భుతమైన నిదర్శనం. 
 
వయసు పైబడినా ఆయన మనసులో ఎప్పటికీ యువకుడే. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత, ఏదైనా సృష్టించాలనే ఉత్సాహం ఆయనలో ఎప్పుడూ ఉండేవి. సింగీతం గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన సినిమాలు రాబోయే తరాలతోనూ ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాయి' అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 
 
'94 ఏళ్ల వయసున్నా సినిమా పట్ల ఎప్పటికీ నిత్యయవ్వనంగా ఉండే హృదయం ఆయనది. సింగీతం గారూ, మీకున్న అంకితభావమే మీ గొప్ప వారసత్వం' అని మాస్ మహారాజ్ రవితేజ పేర్కొన్నారు. 
 
'భారతీయ సినిమా దిగ్గజం ఇక లేరు. సింగీతం శ్రీనివాసరావు అసాధారణమైన ప్రతిభ కలిగిన చిత్రనిర్మాత. భారతీయ సినిమా ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అని హీరో మహేశ్ బాబు పేర్కొన్నారు. 
 
'ఆదిత్య 369, పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మైకేల్ మదన కామ రాజు, భైరవద్వీపం.. ఇలా మీ సినిమాలు చూస్తూ, ఆ అద్భుత ప్రపంచాల్లో విహరిస్తూ పెరిగిన వాళ్లలో నేనూ ఒకడిని. ప్రతి సినిమాలోనూ మీరు చేసిన ప్రయోగాలు, సినిమా మీద మీకున్న తపన మాకు ఎప్పటికీ స్ఫూర్తి. మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా, మీరు సృష్టించిన వెండితెర అద్భుతాలు మా గుండెల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి' అని క్రిష్ జాగర్లమూడి వ్యాఖ్యానించారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్.. వాళ్లను వదిలిపెట్టనంటూ జూ. ఎన్టీఆర్ మండిపాటు