బుధవారం, 12 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 నవంబరు 2025 (10:20 IST)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

dharmendra
అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు ఇంట్లోనే వైద్య సేవలు కొనసాగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సెప్టెంబరు 31వ తేదీన ఆయనను ముంబై మహానగరంలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేర్చిన విషయంతెల్సిందే. శ్వాసపీల్చడంతో అసౌకర్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ధర్మేంద్రను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ ప్రతీత్ సందానీ వెల్లడించారు. కుటుంబ సభ్యుల వినతి మేరకు ధర్మేంద్రకు ఇంట్లోనే వైద్య సేవలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. 
 
కాగా, ధర్మేంద్ర మరణించారంటూ మంగళవారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగిన విషయం తెల్సిందే. ఈ పుకార్లను ఆయన కుమార్తె ఈషా డియోల్ తీవ్రంగా ఖండించారు. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. మా నాన్నగారు క్షేమంగా ఉన్నారు. కోలుకుంటున్నారు. దయచేసి మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వండి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారికి ధన్యవాదాలు అని ఇన్‌స్టా వేదికగా విజ్ఞప్తి చేశారు. అలాగే, ధర్మేంద్ర మృతిపై తప్పుడు ప్రచారం జరగడంతో బాలీవుడ్ దిగ్గజ నటి హేమమాలిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.