సినీ ప్రయోగాల రుషి సింగీతం శ్రీనివాస రావు ఇకలేరు...
సినీ ప్రయోగాల రుషిగా పేరుగడించిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఇకలేరు. ఆయన వయసు 95 యేళ్లు. భారత సినీ యవనికపై తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న దిగ్గజ దర్శకుడు. అనారోగ్య సమస్యలతో పాటు వృద్ధాప్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 64 చిత్రాలకు దర్శకత్వం వహించి, భారతీయ సినిమా గతిని మార్చిన విలక్షణ సృష్టికర్తగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.
సింగీతం శ్రీనిసరావు ప్రస్థానం 'మాయాబజార్' వంటి క్లాసిక్ చిత్రానికి కె.వి.రెడ్డి వద్ద సహాయకుడిగా ప్రారంభమైంది. ఆ తర్వాత దర్శకుడిగా మారి, భారత చలనచిత్ర చరిత్రలో మర్చిపోలేని చిత్రాలను అందించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో ప్రయోగాలు ఒక ముఖ్యమైన భాగంగా ఉండేవి. సంభాషణలు లేని బ్లాక్ కామెడీ 'పుష్పక విమానం' (1987), భారతీయ సినిమాలో తొలి టైమ్-ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ఖ్యాతి పొందిన 'ఆదిత్య 369' (1991), సుధా చంద్రన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన స్ఫూర్తిదాయక నృత్య కావ్యం 'మయూరి' (1985) వంటివి ఆయన సృజనాత్మకతకు తార్కాణాలు. కమల్ హాసన్తో ఆయన తీసిన 'అపూర్వ సహోదరులు', 'మైఖేల్ మదన కామరాజన్' చిత్రాలు కూడా కమర్షియల్గా భారీ విజయాలు సాధించాయి.
సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లోనే, గ్రాఫిక్స్, సీజీఐ హంగులు లేకుండానే తన కథనంతో ప్రేక్షకులను అబ్బురపరిచిన దర్శక మేధావి సింగీతం. ఆయన ప్రతిభకు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు ఎన్నోసార్లు వరించాయి. అద్భుతమైన విషయం ఏమిటంటే, 94 ఏళ్ల వయసులో కూడా ఆయన మళ్లీ దర్శకత్వం చేపట్టారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో నాగ్ అశ్విన్ నిర్మించిన 'సింగ్ గీతం' అనే మ్యూజికల్ ఫాంటసీ చిత్రానికి ఈ ఏడాది దర్శకత్వం వహించారు.
సింగీతం మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పిస్తూ, "ఆయన ఒక దార్శనికుడు. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి వంటి ఆయన చిత్రాలు తరాలు మారినా తాజాగా అనిపిస్తాయి" అని పేర్కొన్నారు. బ్లాక్ అండ్ వైట్ 'మాయాబజార్' కాలం నుంచి 2026లో థియేటర్లలో విడుదలైన 'సింగ్ గీతం' వరకు ఆయన సినీ ప్రయాణం అసామాన్యమైనది,

