మంగళవారం, 17 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 18 ఫిబ్రవరి 2026 (18:25 IST)

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

INCA Award logo
INCA Award logo
భారతీయ జాతీయ సినీ అకాడమీ(INCA) ఈరోజు 2026 ఏప్రిల్ 15 & 16 తేదీలలో ముంబైలో జరగనున్న కళ్యాణ్ జ్యువెలర్స్ INCA అవార్డుల ప్రారంభ ఎడిషన్ తేదీలను ప్రకటించింది. ఈ అవార్డులు, భారతీయ సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాయి.
 
భారతదేశంలోని 12 భాషల సినీ పరిశ్రమలను ఒకే అకాడమీ కింద కలిపే తొలి జాతీయ వేదికగా INCA రూపుదిద్దుకుంది. భాషలు, ప్రాంతాలు మధ్య మరింత సహకారం పెంపొందించడమే లక్ష్యంగా, భారతీయ సినిమా వైవిధ్యాన్ని, ప్రపంచ స్థాయి ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ వేదిక రూపొందించబడింది. ఇకపై విడివిడిగా కాకుండా, భారతీయ సినిమా ఒకే సాంస్కృతిక శక్తిగా నిలబడే దిశగా ఇది కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.
 
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL), SIIMA ప్రమోటర్లు విష్ణు  వర్ధన్ ఇందూరి నాయకత్వంలో INCA ప్రారంభమవుతోంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ముఖ్య పేట్రన్‌గా వ్యవహరిస్తుండగా, అంతర్జాతీయ స్థాయి సినీ అకాడమీలా గుర్తింపు పొందేలా దీన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. తొలి ఎడిషన్ కు కళ్యాణ్ జువెలర్స్ ప్రెజెంటింగ్ స్పాన్సర్‌గా చేరడం ఈ వేదికకు మరింత ప్రతిష్టను తెచ్చింది.
 
అకాడమీలా రూపొందించిన ఈ అవార్డుల్లో పారదర్శకత, విశ్వసనీయత, సహచరుల గుర్తింపు ప్రధానంగా ఉంటాయి. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాళీ, భోజ్‌పురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, అస్సామీ, గుజరాతీ భాషల్లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు ప్రదానం చేయబడతాయి. అదనంగా దర్శకత్వం, నటన, సంగీతం, టెక్నికల్ విభాగాలు, డెబ్యూ కేటగిరీల్లో ఆల్ ఇండియా స్థాయి అవార్డులు కూడా ఉంటాయి.
 
ఎంట్రీలకు ఆహ్వానం:
2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య విడుదలైన సినిమాల నిర్మాతలు/దర్శకులు తమ చిత్రాలను సమర్పించవచ్చు.
• చివరి తేదీ: మార్చి 1
• ఆన్లైన్ సమర్పణ: www.INCA.in
 
INCA అవార్డ్స్ కేవలం ఒక పురస్కార కార్యక్రమం మాత్రమే కాదు, భారతీయ సినిమాను ఒకటిగా సలబ్రేట్ చేసుకునే నేషనల్ మూమెంట్ కి ఇది ఆరంభం. సరిహద్దులు లేని ప్రతిభను గౌరవిస్తూ, సహకారానికి పునాది వేసే  కొత్త యుగానికి ఇది నాంది పలుకుతోంది.