ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 16 మార్చి 2026 (07:35 IST)

Harish Shankar: ఖుషికి కొనసాగింపు అనుకున్నాం కానీ కారణాలవల్ల ఉస్తాద్ కథ మార్చాం : హరీష్ శంకర్

Pawan Kalyan, Harish Shankar, Rashi khanna, Sreeleela, Raashii Khanna and others
Pawan Kalyan, Harish Shankar, Rashi khanna, Sreeleela, Raashii Khanna and others
'గబ్బర్ సింగ్'  తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, మాస్ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి ఉగాది కానుగా మార్చి 19వ తేదీన 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లలో అడుగుపెట్టనుంది.

ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "ముందుగా ఈ సినిమా ఎందుకు ఆలస్యమైంది అనేది నేను మీతో పంచుకుంటాను. మొదట కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఖుషికి కొనసాగింపు లాంటి కథ అనుకున్నాము. కాలేజ్ సమయంలో ఇగోతో విడిపోయిన ఇద్దరు స్టూడెంట్స్.. అదే ఇగోతో కాలేజ్ లో లెక్చరర్స్ గా జాయిన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో కథ అనుకున్నాం. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల కథ మార్చడం జరిగింది. కోవిడ్ కూడా కొంత ప్రభావం చూపించింది. అందరూ ఈ సినిమాను చాలా వేగంగా పూర్తి చేశాను అంటున్నారు. ఈ సినిమా ఆలస్యానికి నేనే కారణం, వేగంగా షూటింగ్ పూర్తి కావడానికీ నేనే కారణం. 
 
ఈ ప్రయాణంలో మా నిర్మాతలు నవీన్ గారు, రవి గారు నన్ను భుజాల మీద మోశారు. గుండెల్లో పెట్టుకున్నారు. ఏ దర్శకుడికైనా డ్రీమ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు. సినిమా కోసం అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తారు. కాలరే ఎత్తరా సాంగ్ కోసం మైత్రి కెరీర్ లోనే అతి పెద్ద సెట్ వేశారు. ఆనంద్ సాయి గారు అద్భుతమైన సెట్ లు వేశారు. కథ మారినా, నా గురించి బయట కథలుకథలుగా చెప్పుకున్నా.. రెండున్నరేళ్లు నాతో కలిసి ప్రయాణం చేసిన దశరథ్ గారికి గారికి కృతఙ్ఞతలు. అలాగే మా రమేష్ రెడ్డి గారికి, ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్ గారికి కూడా కృతఙ్ఞతలు. తెర మీద హీరో పవన్ కళ్యాణ్ గారైతే, తెర వెనుక హీరో దేవి శ్రీ ప్రసాద్ గారు. అద్భుతమైన పాటలు అందించారు. అలాగే థమన్ గారి నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోరిక మేరకే ఈ సినిమాను ముందుగా ఉగాదికి తీసుకొస్తున్నాము. ఈసారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది. పార్థిబన్ గారు, కె.ఎస్. రవికుమార్ గారు ఈ సినిమాలో గొప్ప పాత్రలు చేశారు. శ్రీలీల గారు అనగానే అందరికీ డ్యాన్స్ లు గుర్తుకొస్తాయి. అయితే ఇందులో ఆమె పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. 
 
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ లు ఈ సినిమాలో చూస్తారు. నిద్ర కూడా మాని సినిమా కోసం పని చేస్తున్న మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు. కోవిడ్ సమయంలో మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నప్పుడు.. నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. అప్పటినుంచి ఎంతో ఉత్సాహంతో ఈ సినిమా చేశాము. ఆయన పరుగెత్తారు, మమ్మల్ని పరుగెత్తించారు. గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అని. ఇప్పుడు డైలాగ్ మార్చుకున్నాను. కమిట్ మెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటుంది. ఆయన కటౌట్ ని మన అందరి గుండెల్లో పెట్టుకున్నాము. నా గుండె లోపల పవన్ కళ్యాణే, నా గుండె బయట పవన్ కళ్యాణే, నా గుండె ధైర్యం పవన్ కళ్యాణే. పగలు ప్రజాసేవలో ఉండి, రాత్రుళ్ళు సినిమా షూటింగ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు. మార్చి 19న థియేటర్లలో కలుద్దాం. ఉస్తాద్ ఉగాది జరుపుకుందాం." అన్నారు. 
 
కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. "హరీష్ శంకర్ గారు నిజాయితీగా పని చేస్తారు. అందుకే అంత ముక్కుసూటిగా ఉంటారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. హరీష్ శంకర్ గారు సరిగా నిద్ర కూడా పోకుండా ఒక యజ్ఞంలా ఈ సినిమా పూర్తి చేశారు. ఆ యజ్ఞం ఫలించాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు నవీన్ గారు, రవిశంకర్ గారికి కృతఙ్ఞతలు. ప్రతి చిన్న విషయంలో ఎంతో శ్రద్ధ పెట్టి, ఈ సినిమా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన పాటలు అందించారు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. మా హీరో పవన్ కళ్యాణ్ గారు.. పవర్ స్టార్, పీపుల్ స్టార్. ఆయన గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు నేను. నేను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నా అని తెలిసి.. తమిళ, కన్నడ ఇలా సినిమా సెట్ కి వెళ్ళినా పవన్ గారి గురించి అడిగేవారు. ఆయనను చూసి చాలా చాలా నేర్చుకున్నాను. పాజిటివ్ గా ఉండటం, మన జీవితం మనం చూసుకోవడం కాకుండా చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, ప్రకృతిని ప్రేమించడం.. ఇలా ఎన్నో నేర్చుకున్నాను. పవన్ గారు సినిమాలు చేయడం అనేది సినిమాకి మంచింది. ఎందరికో ఆయన నిజమైన స్ఫూర్తి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిని ఉస్తాద్ ఉగాది చేస్తారని కోరుకుంటున్నాను. మార్చి 19న థియేటర్లలో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం." అన్నారు.
 
కథానాయిక రాశి ఖన్నా మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ నమస్కారం. నా కెరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని కోరిక ఉండేది. ఉస్తాద్ భగత్ సింగ్ తో నా కల నెరవేరింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో సింపుల్ గా ఉంటారు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక మనిషిగా నాలో ఎంతో స్ఫూర్తిని నింపారు. ఆయన తక్కువ మాట్లాడతారు. కానీ ప్రతి మాటలో విలువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప స్టార్ తో తెరను పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. హరీష్ శంకర్ గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నేను కళ్లారా చూశాను. ఈ సినిమా గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని నమ్ముతున్నాను. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పని చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి నిర్మాతలతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. శ్రీలీల స్వీట్ హార్ట్. తనతో వర్క్ చేయడం చాలా బాగుంది." అన్నారు.
 
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. "మేము ఎన్ని పెద్ద సినిమాలు చేసినా.. సినీ పరిశ్రమకు వచ్చిన తొలినాళ్ళ నుంచి మాకు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనేది మా కల. ఈరోజు మాకు ఎంతో ప్రత్యేకం. మా కోరిక ఈ మార్చి 19న నెరవేరుతుంది. డిప్యూటీ సీఎం అయినా, ప్రజాసేవలో బిజీగా ఉండి కూడా.. మాకు ఈ సినిమా చేసి పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూరిగా కృతఙ్ఞతలు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మేము అడగడానికి ఆలోచిస్తుంటే, మీ సినిమా పూర్తి చేస్తానని చెప్పి ఆయన మాకు ధైర్యం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని అనుకున్నప్పటి నుంచి దీనికి దర్శకుడు హరీష్ శంకర్ కావాలని అనుకున్నాను. గబ్బర్ సింగ్ ని మించేలా ఈ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు. ఇది పవన్ కళ్యాణ్ గారి మార్క్ ఎంటర్టైనర్ సినిమా. మార్చి 19న థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేయండి." అన్నారు.
 
నిర్మాత రవిశంకర్ యలమంచిలి మాట్లాడుతూ.. "పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ నమస్కారం. ఈ సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కృతఙ్ఞతలు. గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి, ఈ సినిమా కోసం హరీష్ శంకర్ గారు ఎంతో కష్టపడ్డారు. అభిమానులు మెచ్చేలా ఈ సినిమాని మలిచారు. మాకు ఇలాంటి గుర్తుండిపోయే సినిమాను చేసిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయలేదనే వెలితి మాకు ఉండేది. ఉస్తాద్ తో పరిపూర్ణంగా ఆ వెలితి తీరిపోయింది. సినిమా అవుట్ పుట్ చూసుకున్నాను. రిజల్ట్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నాము. ప్రజాసేవలో ఉండి కూడా ఈ సినిమాను పూర్తి చేశారు. రాత్రుళ్ళు నిద్రపోకుండా షూటింగ్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆయన కష్టం ముందు మా అందరి కష్టం చాలా చిన్నది అనిపించింది. మేము ఎంతోమందిని చూసి ఉండొచ్చు, కానీ ఆయన చాలా ప్రత్యేకం. పవన్ కళ్యాణ్ గారు మాలో ఎంతో స్ఫూర్తి నింపారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నేను ఇటీవల కొందరికి సాయం చేశారు. ఆయన కొన్నిరోజులు ప్రయాణం చేస్తే, నలుగురి సాయం చేయాలనే ఆలోచన మనంలో ఖచ్చితంగా కలుగుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికొస్తే.. ఈ మధ్య కాలంలో నేను చూసిన సూపర్ డూపర్ కమర్షియల్ ఫిల్మ్. ప్రారంభం నుంచి చివరి దాకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను." అన్నారు.
 
ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక, అభిమానుల కోలాహలం నడుమ ఆద్యంతం ఆనందభరితంగా సాగింది. చిత్రం బృందంతో పాటు, పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.