ప్రేమ, జ్ఞాపకాలతో తెరకెక్కిన సహ సినిమా చాలా నచ్చింది : కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram, Tejeshwar Velpucharla, Nishanth Doti
తాజాగా చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ తొలి పాట 'కాలాన్నే తిరగేసి'ను విడుదల చేసింది. ఈ పాటని 'ఎమోషన్ ఆఫ్ సాహ'గా పరిచయం చేశారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మరోసారి తన మెలోడీ మ్యాజిక్‌ను చూపించారు. నెమ్మదిగా మొదలై క్రమంగా భావోద్వేగాలను పెంచుకుంటూ సాగే ఈ గీతం అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో అందరినీ కదిలిస్తుంది.
తన జీవితంలోని ప్రేమను కోల్పోయిన కథానాయకుడు, మళ్లీ ఆమెను కలుసుకోవాలని కలలు కంటూ అనుభవించే ఆవేదన, ఆశలను ఈ పాట అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. 'మళ్లీ రావా' అనే పల్లవి అతని మనసులోని తపనను హృదయానికి హత్తుకునేలా చేతుంది. పూర్ణాచారి రాసిన సాహిత్యం భావోద్వేగాలకు కవిత్వ రూపం ఇవ్వగా, అనురాగ్ కులకర్ణి తన మధురమైన వోకల్స్ తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు.
ప్రేమని కోల్పోయిన యువకుడి పాత్రలో శివ కుమార్ కాసారం ఎంతో సహజంగా నటించారు. శ్వేత లక్ష్మణ్ కూడా తన పాత్రలో భావోద్వేగాలను అద్భుతంగా పలికిస్తూ ఆకట్టుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ చిత్రంలో వ్రజనా పాండ్యా మరో కథానాయికగా నటిస్తుండగా, మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘనా సునీల్, బాంబే పద్మ, కొండా రెడ్డి, హర్షవర్ధన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
కరుణాకర్ కె సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, దినేష్ పెద్ది ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇప్పుడు విడుదలైన తొలి పాట కథలో సంగీతానికి ఎంత ప్రాధాన్యం ఉందో తెలియజేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, నిర్మాత తేజ్ నా స్నేహితుడు. ఈ సినిమా నిర్మించిన ప్రతి ఒక్కరి జీవితాలు ఈ సినిమాతో సెటిల్ అయితే చాలని ఆయన చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. శేఖర్ చంద్ర అద్భుతమైన సంగీతం అందించారు. పూర్ణాచారి గారి సాహిత్యం చాలా బాగుంది. అనురాగ్ కులకర్ణి వాయిస్ ఈ పాటకు మరో పెద్ద ప్లస్ అయింది. శ్వేత చాలా చక్కగా నటించింది. తన పాత్ర చాలా సవాళ్లతో కూడుకున్నది. ఆమె పెర్ఫార్మెన్స్ అందరికీ గుర్తుండిపోతుంది. నిశాంత్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది. ప్రతి ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.
నిర్మాత పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు నిలబెట్టుకున్నాడు. శివ కుమార్‌తో నాకు షార్ట్ ఫిల్మ్స్ రోజుల నుంచే పరిచయం ఉంది. ఈ సినిమా కోసం అతను ఎంత కసితో పనిచేశాడో నాకు తెలుసు. పదేళ్ల నిరీక్షణ అతని కళ్లలో కనిపించింది. ఒక సందర్భంలో అతనితో మాట్లాడుతుంటే నా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. తన జీవితం నిలబడాలనే ఆశతో ఈ సినిమా చేశాడు. ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి అతనికి ఆ నమ్మకాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి ఎమోషనల్ డ్రామా. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ చిత్రానికి మంచి జరగాలి. అందరికీ థ్యాంక్యూ సో మచ్.
