J. D. Chakravarthy: ప్రచారం కోసం బూతులు మాట్లాడడాన్ని బరాబర్ ఖండిస్తున్నా : జె. డి. చక్రవర్తి
ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం రకరకాల ప్రక్రియలతో చేస్తుంటారు. దాని కోసం బూతులను మాట్లాడడం, అమ్మాయిలను హాఫ్ నేకెడ్ గా చూపించడం, లిప్ లాక్ లు చేయడం అనేది కరెక్ట్ కాదు. భాషను బూతులుగా మారుస్తూ చేసిన పాటను పాడుతున్న ఆ ఫంక్షన్ లో నేను వెంటనే బయటకు వచ్చేసి వుండాల్సింది. తప్పు చేశాను అని సీనియర్ నటుడు జె. డి. చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను విడుదల చేశారు.
ఇటీవల తాను అతిధిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నానని జె.డి.చక్రవర్తి తెలిపారు. ఆయన మాట్లాడుతూ... "సినిమాలకు ప్రచారం కల్పించేందుకు ఘోరంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఇటీవల నేను అతిధిగా పాల్గొన్న ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో... ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండిపోయాను. మధ్యలోనే వచ్చేసి ఉండాల్సిందని ఇప్పుడు బాధపడుతున్నాను. సృజనాత్మకతమైన ఆలోచనలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలే తప్ప, రోత పుట్టించే జుగుప్సాకరమైన వేష, "భాష"లతో కాదని నేను బలంగా నమ్ముతాను" అని జె.డి.చక్రవర్తి అన్నారు. ఈమేరకు ఆయన ఒక వీడియో సైతం విడుదల చేశారు.
అసలు ఏమి జరిగిందో తెలియాలంటే. బరాబర్ ప్రేమిస్తా ప్రమోషన్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఆ సమయంలో స్టేజీపై ఓ గాయకుడు బూతులతో ఓ పాటను పాడాడు. దానికి క్రిటిక్స్ విమర్శలు ఎక్కు పెట్టారు. పాట అనే ముసుగులో “గొప్ప కల్చర్” అని చెప్పుకుంటూ అసభ్యతను, దిగజారిన భావాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇవి పాటలు కాదు…ఈ జనరేషన్‌కి ఊతపదాలుగా మారుతున్న పదజాలం. సినిమా సమాజంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిన వాళ్లే ఇలాంటి కంటెంట్‌ను నిర్లక్ష్యంగా వదిలేస్తుండటం బాధాకరం. అయితే అక్కడే వున్న ప్రముఖులు జె.డి చక్రవర్తి, దర్శకుడు జయంత్ ఆస్వాదిస్తూ చప్పట్లు కొట్టడం తీవ్ర విమర్శలకు తావించింది. దానితో నేడు ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చింది.