ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 మార్చి 2026 (16:55 IST)

కర్నాటకకు రావడం అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చినట్టుగా ఉంది : జూనియర్ ఎన్టీఆర్

jr ntr
తాను కర్నాటకు రావడం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా ఉందని టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. బెంగుళూరు నగరంలో కొత్తగా నిర్మించిన కిమ్స్ హాస్పిటల్ స్పెషాలిటీ బ్లాక్‌ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. 
 
వారిని ఉద్దేశించిన ఎన్టీఆర్ మాట్లాడుతూ, 'కర్ణాటకకు రావడం అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చినట్లుగా ఉంటుంది. 1983 మార్చి 20న తాతగారు ఇక్కడ శంకుస్థాపన చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు అదే మార్చిలో నేను రావడం ఆనందంగా ఉంది. ఇది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. తాత ఆశీస్సులు, మీ అందరి ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది' అని పేర్కొన్నారు. 
 
వాహనాలను నడిపే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఎప్పటిలాగే అభిమానులకు సూచించారు. పాతికేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ ఎలా ఉంటారు? అని ఓ వైద్యుడు అడగ్గా.. 67 అంటూ (అప్పటికి తన వయసు) నవ్వులు పూయించారు. ఒకవేళ డాక్టర్‌ అయితే.. దేనిలో స్పెషలిస్ట్‌ అయ్యేవారు? అని అడగ్గా.. పీడియాట్రిషియన్‌ (చిన్నపిల్లల వైద్యుడు) అని చెప్పారు. తనకు చిన్నారులంటే  ఇష్టమన్నారు.  
 
తమ అభిమాన నటుడిని చూసేందుకు ఆస్పత్రి వద్దకు ఫ్యాన్స్‌ తరలి వచ్చారు. కారులోంచే అభిమానులకు అభివాదం చేశారు ఎన్టీఆర్‌. కొత్త సినిమా లుక్‌తో కూడిన ఎన్టీఆర్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కోసమే ఎన్టీఆర్‌ ఈ లుక్‌లోకి మారారు. చెవికి రింగ్‌ కూడా పెట్టుకున్నారు. 
 
ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్‌ను ఖరారు చేయగా, ఎన్టీఆర్‌ సరసన కన్నడ నటి రుక్మిణీ వసంత్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందని సమాచారం.