గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : బుధవారం, 10 డిశెంబరు 2025 (15:45 IST)

Kamal sar: కథను ఎలా చెప్పాలి, ప్రజలకి చేరువ చేయాలి అనే దానికి కమల్ సార్ స్ఫూర్తి

Stalin, Udayanidhi, Kamal hasan etc
Stalin, Udayanidhi, Kamal hasan etc
దక్షిణ భారత మీడియా, వినోద పరిశ్రమలో ఒక కీలకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది జియో హాట్ స్టార్. దక్షిణాదిలో సృజనాత్మకతను కొత్త పుంతలు తోక్కించే దిశగా జియోహాట్‌స్టార్ తన మాతృ సంస్థ జియోస్టార్ రాబోయే ఐదు సంవత్సరాలలో ₹4,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. చెన్నైలో మంగళవారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, తమిళ భాషాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎంపి స్వామినాథన్, గౌరవనీయ పార్లమెంటు సభ్యులు పద్మభూషణ్ శ్రీ కమల్ హాసన్, ఇంకా దక్షిణాది సినీ, బుల్లితెర పరిశ్రమలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
జియోస్టార్‌లో SVOD హెడ్ & చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుశాంత్ శ్రీరామ్, జియోస్టార్‌ క్లస్టర్, ఎంటర్‌టైన్‌మెంట్ (సౌత్) హెడ్ కృష్ణన్ కుట్టి హాజరై.. భారతదేశ వినోద రంగంలో జియోహాట్‌స్టార్ తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు గురించి, భారతీయ కథా కథనాలను మరింత విస్త్రత స్థాయిలో దక్షణాది ప్రేక్షకులకి అందించడానికి చేస్తున్న కృషి గురించి వివరించారు.
 
ఆ దిశగా జియోహాట్‌స్టార్ తమిళనాడు ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. తమిళనాడు ప్రభుత్వంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేస్తున్నట్లు జియోహాట్‌స్టార్ ప్రకటించింది. రాష్ట్ర సృజనాత్మక, నిర్మాణ వ్యవస్థను వేగవంతం చేయడానికి ఉమ్మడి దృష్టిని ప్రతిబింబించేలా ఈ భాగస్వామ్యం ఉంటుంది. ఇందులో భాగంగా, జియోహాట్‌స్టార్ తమిళనాడు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాంతీయతకు పెద్ద పీట వేసి, కొత్త తరం కథలు, భౌగోళిక సరిహద్దులను దాటి వినూత్న కథలను భారీ స్థాయిలో పరిచయం చేయాలన్నది ఈ ఒప్పందం ఉద్దేశ్యం. ఆ దిశగా జియోహాట్‌స్టార్ నవతరం చిత్రనిర్మాతలు, రచయితలు, ఎడిటర్‌లు మరియు డిజిటల్ కథకులను ప్రోత్సహించే విధంగా రైటింగ్ ల్యాబ్‌లు, దిశానిర్దేశ శిబిరాలు (మెంటర్‌షిప్ ప్రోగ్రామ్స్), నైపుణ్యాభివృద్ధి వర్క్‌షాప్‌లు వంటి సృజనాత్మక కేంద్రీకృత పథకాలను అందుబాటులో తీసుకురానుంది.
 
ఈ సరికొత్త అధ్యాయానికి ప్రతీకగా, దక్షిణాది సంస్కృతీ, సాంప్రదాయాలను చాటే, ప్రాంతీయ వినోద భవిష్యత్తుకి బాటలు వేసే 25 కొత్త టైటిల్స్‌తో కూడిన జియోహాట్‌స్టార్ బ్లాక్‌బస్టర్ సౌత్ లైనప్‌ను గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆవిష్కరించారు.
 
ఈ కార్యక్రమంలో తమిళనాడు సృజనాత్మక భవిష్యత్తు, తదుపరి కార్యాచరణ రూపకల్పన, ఈ ఒప్పందం ఉద్దేశ్యాల గురించి గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇలా అన్నారు: “జియోహాట్‌స్టార్‌తో భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉంది. తమిళనాడు అన్ని దక్షిణాది రాష్ట్రాలకి కేంద్రంగా ఉంది. తెలుగు, కన్నడ, మలయాళం సినిమా ఇక్కడే పుట్టాయి. దక్షిణాది రాష్ట్ర కళాకారులకు ఇది నిలయం కావడం గొప్ప విషయం. తమిళ చరిత్రలో కళలు, సాహిత్యం ప్రత్యేకమైనవి. కళ మార్పు తీసుకురాగలదు, సినిమా ప్రజలను ఎడ్యుకేట్ చేయగలదు. తమిళ రచయితలు కథలను సామాజిక మార్పుకి ఆయుధంగా మార్చారు. 
 
అన్నాదురై, కలైంజర్ కరుణానిధి సంభాషణలు ప్రేక్షకులని అలరించడమే కాదు, గొప్ప స్పూర్తిని ఇచ్చాయి. మార్పుకి శ్రీకారం చుట్టాయి. సామాజిక మార్పులకు కారణమయ్యే కథల చరిత్ర మనకు ఉంది. దక్షిణ భారతదేశ సహకారం భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాలను సృష్టించింది. కథలు చెప్పే విషయంలో కంటెంట్ ముఖ్యం. కంటెంట్ బాగుంటే చాలు, భాష, ప్రాంతం దాటి అన్ని భాషల వారిని అలరిస్తాయి. కథను ఎలా చెప్పాలి, ఎలా ప్రజలకి చేరువ చేయాలి అనేదానికి కమల్ సార్ గోప్ప స్ఫూర్తి, ఉదాహరణ. సినిమాలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. 2012 లోనే కమల్ సార్ డైరెక్ట్ ఇంటికి సినిమాని విడుదల చేశారు. 
 
ఆ దిశగా జియో హాట్ స్టార్ అమలుచేస్తున్న ఈ ప్రాజెక్టుని స్వాగతిస్తున్నాను. ఈ భాగస్వామ్య ఒప్పందంతో యువ కళాకారులకు ఆధునిక సాంకేతికత ఆధారంగా శిక్షణ ఇవ్వడానికి దోహదపడుతుంది. అలాగే క్రియేటివ్ లాబ్ లు ఏర్పాటవుతాయి. చెన్నై గ్లోబల్ ఫిలిం సిటీగా రూపాంతరం చెందుతుంది. రాబోయే 5 ఏళ్ళలో జియో హాట్ స్టార్ దక్షిణాది వినోద రంగంలో రూ. 12 వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. తద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 15000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ భాగస్వామ్యంతో సినిమా ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.”