హీరో కార్తి చిత్రం వా వాత్తియార్ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్
కార్తి హీరోగా నటించిన తాజా చిత్రం వా వాత్తియార్. తెలుగులో అన్నగారు వస్తారు. నలన్ కుమార స్వామి దర్శకుడు. డిసెంబరు 12వ తేదీన విడుదల కావాల్సివుంది. అయితే, ఈ చిత్రం విడదలకు మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది. ప్రముఖ ఫైనాన్షియర్ అర్జున్ లాల్ వద్ద ఈ చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ రూ.10.35 కోట్ల రుణం తీసుకుది. ఈ మొత్తానికి వడ్డీతో కలిపి రూ.21.78 కోట్లు అయింది. ఈ మొత్తం చెల్లించేవరకు చిత్రం విడుదల చేయొద్దని నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజాను ఆదేశిస్తూ విడుదలపై మధ్యంతర స్టే విధించింది.
ఈ చిత్రం వివాదానికి గల కారణాలను పరిశీలిస్తే, స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ తమ వద్ద రూ.10.35 కోట్ల రుణం తీసుకుందని, ఆ మొత్తం వడ్డీతో కలిపి ప్రస్తుతం రూ.21.78 కోట్లు అయిందని తిరిగి చెల్లించేలా ఆదేశించాలని, అప్పటివరకు చిత్రం విడుదలను వాయిదా వేయాలని అర్జున్‌లాల్ కొన్ని రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎం.సుబ్రహ్మణ్యం, జస్టిస్ కుమరప్ప ధర్మాసనం మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చి, తదుపరి విచారణను వాయిదా చేశారు. ఈ పిటిషన్ మళ్లీ విచారణకు వచ్చింది. న్యాయస్థానం పలుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ జ్ఞానవేల్ రాజా అప్పు తిరిగి ఇవ్వలేదని, కనుక ఆయన ఆస్తులను జప్తు చేయాలంటూ పిటిషనర్ తరపు లాయర్ వాదించారు.
జ్ఞానవేల్ రాజాకు కోర్టు ఇప్పటికే పలుసార్లు అవకాశం ఇచ్చిందని, ఇకపై మళ్లీ అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ అప్పు తిరిగి చెల్లించే వరకూ విడుదల చేయకూడదని నిషేధం విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.