దుబాయ్‌లో చిక్కుకున్న సినీ తారలు.. మంచు విష్ణు ఫ్యామిలీ దుబాయ్‌లో క్షేమంగా ఉండాలి
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. అక్కడ నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాము క్షేమంగానే ఉన్నామని తెలిపి అభిమానుల ఆందోళనను దూరం చేశారు.
మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ కుమార్, మాధవన్ దుబాయ్‌లో చిక్కుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.. దీంతో వారి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
హీరో అజిత్ గురించి వస్తున్న వార్తలపై ఆయన పీఆర్ టీమ్ స్పందించింది. అజిత్ క్షేమంగా ఉన్నారని వారు ధృవీకరించారు. అయితే విమానాల రద్దు కారణంగా కొంత ఆలస్యమైనా, ఆయన సురక్షితంగా ఉన్నారని తెలియజేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు నటుడు మాధవన్ కూడా తన గురించి వస్తున్న రూమర్లపై స్పందించారు.
తాను ప్రస్తుతం దుబాయ్‌లో లేనని, తన కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సెలవుల్లో ఉన్న టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ఈ దాడుల మధ్య చిక్కుకుపోయారు. తాము ఉంటున్న ఇంటికి అత్యంత సమీపంలో మిస్సైళ్లు పేలడంతో ఇల్లు ఒక్కసారిగా కంపించిందని, తీవ్ర భయాందోళనకు గురయ్యామని ఆయన వెల్లడించారు. ఈ శబ్దాలకు తన చిన్న కూతురు ఐరా తీవ్రంగా భయపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, దుబాయ్ గగనతలంలో డ్రోన్లను ఇంటర్‌సెప్టర్లు అడ్డుకుంటున్న వీడియోను మంచు విష్ణు ఇప్పటికే షేర్ చేశారు. ఏ చిన్నారి కూడా ఇలాంటి యుద్ధ వాతావరణంలో, బాంబుల శబ్దాల మధ్య పెరగకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పిల్లలకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు. అక్కడ నెలకొన్న భయానక పరిస్థితుల నేపథ్యంలో తన సోదరుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేత, క్షిపణి దాడుల వార్తల నేపథ్యంలో మంచు లక్ష్మి స్పందిస్తూ.. "విష్ణు, ఆయన అందమైన కుటుంబం దుబాయ్‌లో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. కష్టకాలంలో మన సొంత వాళ్ళు ఆపదలో ఉంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. మిమ్మల్ని నా గుండెల్లో హత్తుకుంటున్నాను. దేవుడి దయ మీ చుట్టూ ఉండాలి. ప్రేమ మాత్రమే గెలుస్తుంది" అని ట్వీట్ చేశారు.